భారీ భద్రత నడుమ సీఎం పర్యటన
నెల్లూరు(క్రైమ్) : భారీ భద్రత ఏర్పాట్ల నడుమ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెల్లూరు నగర, కోవూరు పర్యటన సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యటన ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా పోలీసులతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. గుంటూర్ రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్, సీఎం భద్రత అధికారి చిట్టెయ్యలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
చంద్రబాబునాయుడు రేణిగుంట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకోవాల్సి ఉండగా సుమారు గంట ఆలస్యంగా వచ్చారు. ఉదయం 8.30 గంటలకే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అంచెలవాణి, మాజీ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కంభం విజయరామిరెడ్డి, పరసా రత్నం, బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపీ ఉక్కాల రాజేశ్వరమ్మ, నాయకులు బెజవాడ ఓబుల్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, తాళ్లపాక రమేష్‌రెడ్డి, జెడ్.శివప్రసాద్, కిలారి వెంకటస్వామి నాయుడు, నువ్వుల మంజుల, యారం మంజుల, జ్యోత్స్నలత తదితరులు కవాతు మైదానంలోని పోలీసు అతిథిగృహానికి చేరుకున్నారు.
విక్రమ సింహపురి వర్సిటీ వీసీ రాజారెడ్డి, సీని యర్ ఐఏఎస్ అధికారులు అనంతరామ్, వాణిమోహన్, కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ సెంథిల్‌కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెం డెంట్ డాక్టర్ కె. శ్రీనివాస్ తదితరులు కూడా ఇక్కడికి వచ్చారు. సుమారు ఉదయం 11.05 గంటలకు వచ్చిన సీఎంకు టీడీపీ నాయకులు, అధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు. సమయాభావం కావడంతో పోతిరెడ్డిపాలెంలోని కార్యక్రమాలను అధికారులు రద్దుచేశారు.
దీంతో ఆయన ప్రత్యేక వాహనంలో హెలిప్యాడ్ నుంచి రోడ్డుమార్గాన వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్నారు. ఇక్కడి బహిరంగ సభ ముగించుకొని మధ్యాహ్నం 2.45 గంటలకు పోలీసు కవాతు మైదానానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం పోలీసు అతిథిగృహంలో ముఖ్యమంత్రి భోజనం చేయాల్సి ఉంది. సమయం మించిపోవడంతో ఆయన ప్రత్యేక బస్సులోనే భోజనం చేశారు. బస్సులోనే కొద్దిసేపు మంత్రి నారాయణ, బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, నూనె మల్లికార్జునయాదవ్‌లతో పాటు పలువురితో మాట్లాడారు.
మధ్యాహ్నం 3 గంటలకు పోలీసు కవాతు మైదానం నుంచి మంత్రి నారాయణ, కలెక్టర్‌తో కలిసి ఆయన హెలికాప్టర్‌లో డక్కిలికి బయలుదేరి వెళ్లారు. టీడీపీ నాయకులు, అధికారులు హెలిప్యాడ్ వద్ద సీఎంకు వీడ్కోలు పలికారు. టీడీపీ సీనియర్ నాయకుడు బెజవాడ ఓబుల్‌రెడ్డి కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్‌లో కూర్చొని ఉండగా ఎండ తీవ్రత కు సొమ్మసిల్లిపడిపోయారు. పార్టీ నాయకులు ఆయన్ను పోలీసు అతిథి గృహంలోకి తీసుకెళ్లి గ్లూకోజ్ నీరు ఇవ్వడంతో తేరుకున్నారు.