ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ‘వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆత్మకూరును అభివృద్ధి చేస్తున్నా.ప్రజలకు తాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం’ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తరచూ చెప్పే మాటలివి. అయితే ఆయన జమానాలోనే జనం స్వచ్ఛమైన తాగునీటికి వెంపర్లాడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో గరళంలాంటి ఫ్లోరిన్ నీటిని తాగి రోగాల పాలవుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకొని జీవచ్ఛవాల్లా మారుతున్నారు. కాళ్లు, కీళ్లు, నడుం నొప్పులు, కిడ్నీ వ్యాధులతో మంచం పట్టి జీవ న్మరణపోరాటం చేస్తున్నారు.
ఆత్మకూరు మండలంలో పడకండ్లలో ప్రజల కడగండ్లు ఇవి. పడకండ్ల పంచాయతీలో బొటికర్లపాడు, గండ్లవీడు, యర్రబల్లి, పడకండ్ల గ్రామాలున్నాయి. పడకండ్ల పంచాయతీ ప్రధాన కేంద్రమే అయినా గ్రామంలో గుక్కెడు నీటికి కరువే. గ్రామంలో 115 కుటుంబాలుంటాయి. బోర్లు, రక్షిత మంచినీటి పథకం ఉన్నాయి. అయితే బోర్లు, మంచి నీటిపథకం నుంచి ఫ్లోరిన్ నీరు సరఫరా అవుతోంది.
నిత్యం ఉపయోగించుకోడానికి, తాగేందుకు కూడా ఆ నీరే గతి. గ్రామంలో వ్యవసాయం, కూలి పనులపైనే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. ఒక తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసినా అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ తాగునీటి పథకం కోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. కాని దాని గురించి పట్టించుకోలేదు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు కీళ్లు, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. పళ్లు గారపట్టి ఉన్నాయి. ఇలా రకరకాల వ్యాధులతో సతమతమవుతున్నారు.
పలువురు రోగాల పాలు
గత కొన్నేళ్లుగా ఫ్లోరిన్ నీరు తాగి స్థానికులు రోగాల పాలవుతున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామంలో సుమారు 20 మంది వరకు మూత్రపిండాల వ్యాధులకు గురైన వారున్నట్టు అంచనా.
గామానికి చెందిన అమ్మన బోయిన వెంగయ్య(45) బొగ్గుకాల్చేపనికి వెళ్లి పొట్ట పోసుకుంటుంటాడు. రెండేళ్ల క్రితం మూత్రపిండాల వ్యాధి బారిన పడ్డాడు. దీంతో అక్కడ ఇక్కడ అప్పులు చేసి వ్యాధి నయం చేయించుకునేందుకు నెల్లూరుకు తిరుగుతున్నాడు. వారానికి రెండుసార్లు ఆయన డయాలసిస్ చేయించుకునేందుకు నెల్లూరు వె ళ్తాడు. పూటగడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ మాయదారి కిడ్నీవ్యాధులు జీవితాల్ని ఛిద్రం చేస్తున్నాయని గ్రామస్తుల ఆవేదన.
పలువురు మృత్యువాత
ఈయన పేరు ఐతా పెద లక్ష్మయ్య (45). ఐదేళ్ల క్రితం మూత్రపిండాల వ్యాధి బారిన పడ్డాడు. అప్పటి నుంచి వైద్యం కో సం పలు ఆస్పత్రుల చు ట్టూ తిరిగాడు. ఐదేళ్లు జీవన్మరణ పోరాటం చేసి గత నెల ఐదో తేదీన మృత్యువాత పడ్డాడు. ఆయన వ్యాధి నయం చేయించేందుకు సుమారు రూ.నాలుగు లక్షలకు పైగా ఖర్చు పెట్టామని, అయినా మనిషి దక్కలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈయన పేరు సింగారెడ్డి రామిరెడ్డి. యాభయ్యో ఏట మూత్రపిండాలు పని చేయడంలేదని పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ఆయన మంచంలోనే గడి పాడు. పదేళ్ల పాటు జీవన్మరణ పోరాటం చేసి 2008వ సంవత్సరంలో చనిపోయాడు. బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. ఐదారు లక్షలు ఖర్చుపెట్టినా దక్కించుకోలేకపోయామని కుటుంబసభ్యులు తెలిపారు.
తాగునీటికి రోజుకు
రూ.2 వేలు ఖర్చు
ఫ్లోరిన్ నీరు తాగి రోగాల పాలవుతుండటంతో కొద్దిగా స్తోమత కలిగిన 40 కుటుంబాలు వింజమూరు నుంచి క్యాన్ నీరు తెప్పించుకుంటున్నాయి. ఒక్కో క్యాన్ రూ.15. రోజుకు ఒక్కో కుటుంబం మూడు లేదా నాలుగు క్యాన్ల నీరు తెప్పించుకుంటుంది. 40 కుటుంబాలు రోజుకు తాగునీటి కోసం సుమారు రూ.1800 నుంచి రూ.2వేలు ఖర్చు పెడుతున్నట్టు అంచనా. అంటే నెలకు సుమారు రూ.60 వేలు తాగునీటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక స్తోమత లేని ఫ్లోరిన్ నీరే తాగి బతుకీడుస్తున్నారు.
నెలకు ఐదువేలు ఖర్చు
సంవత్సరం క్రితం మూత్రపిండాలు సక్రమంగా పని చేయడంలేదని తేలింది. అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా. నెలకోసారి నెల్లూరుకు వెళ్లి ఆస్పత్రిలో చూపించుకుని వస్తున్నా. మందులు, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి రూ.5 వేలకు పైన అవుతోంది. ఏం చేస్తాం, తప్పదు. ఈ మాయదారి నీళ్లు తాగి రోగాలొస్తున్నాయి.
-యనమల సంజీవమ్మ, పడకండ్ల
మోకాళ్ల నొప్పులతో సతమతం
మోకాళ్లు, కీళ్ల నొప్పుల బాధ అంతా ఇం తా కాదు. నెల్లూరు, కావలి ప్రాంతాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరిగా. క్యాన్ నీరు తెచ్చుకుని తాగే స్తోమత లేదు. నీరు విషమని తెలిసినా తాగక తప్పడం లేదు. మోకాళ్ల నొప్పులు నయం చేయించుకునేందుకు పదివేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టా. గుక్కెడు మంచినీళ్లు అం దించి పుణ్యం కట్టుకోండి.
-మద్దిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, పడకండ్ల
మంత్రి ఇలాకాలో మరణమృదంగం
Published Mon, Aug 5 2013 3:59 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement