annam ramanarayana reddy
-
ఇదీపాయే!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర : విభజన అనంతరం పార్టీ జెండాను భుజానికెత్తుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి కూడా దక్కకుండాపోయింది. విభజన అనంతరం సీఎం కుర్చీ దక్కించుకునే ప్రయత్నం చేసిన ఆనంకు బీసీ కోటాలో రఘువీరారెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఎగరేసుకుపోవడం మింగుడుపడని అంశం. కొణిజేటి రోశయ్యను సీఎంగా తప్పించిన సమయంలో మంత్రి హోదాలో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి సీఎం పదవి కోసం గట్టిగానే ప్రయత్నించారు. అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పదవి ఎగరేసుకుపోయారు. దీంతో అసంతృప్తి చెందిన ఆనంకు ఆర్థిక శాఖను ఇచ్చి పార్టీ హైకమాండ్ జోకొట్టింది. రాష్ర్ట విభజన అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆనం మరోసారి సీఎం పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేశారు. కొందరు సహచర మంత్రులతో కలసి రాష్ట్రపతి పాలన విధించవద్దని సోనియాకు విన్నవించుకున్నారు. పార్టీ హైకమాండ్ రాష్ట్రపతి పాలనకే నిర్ణయం తీసుకోవడంతో ఆనం ఆశలు ఆవిరయ్యాయి. సీమాంధ్రకు ప్రత్యేకంగా పీసీసీని నియమిస్తే ఆ అవకాశమైనా తనకు దక్కించుకునేందుకు ఆనం ఆశపడ్డారు. రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పవచ్చనుకున్నారు. అయితే బీసీ కోటా లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి తన్నుకుపోవడంతో ఆనం రామనారాయణరెడ్డికి మరోసారి ఆశాభంగం ఎదురైంది. అయితే ఏపీ మేనిఫెస్టో కమిటీ చైర్మనగా ప్రకటించి చల్లబరిచారు. -
టీడీపీ- కాంగ్రెస్ మున్సి‘పల్టీ’లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంగ్రెస్ పార్టీని తాము బతికించుకుంటామని ప్రకటించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సొంత జిల్లా నెల్లూరులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు ఆనం సోదరులు శాసించిన నెల్లూరు కార్పొరేషన్లో సైతం పూర్తిస్థాయిలో అభ్యర్థులను బరిలోకి దించుకునేందుకు వారు మున్సి ‘పల్టీ’లు కొడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారే టీడీపీ అభ్యర్థులుగా మారుతుండటంతో ఆ పార్టీలో తిరుగుబాట్ల స్వరం వినిపిస్తోంది. మార్చిలో జరగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు మున్సిపల్, స్థానిక ఎన్నికలను రాజకీయ పార్టీలు సెమీఫైనల్‌గా తీసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజే కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో విస్తృత స్థాయి సమావేశం జరిపింది. కార్పొరేషన్‌లోని 54 డివిజన్లకు తమ అభ్యర్థులు ఖరారైపోయారనీ, మిగిలిన పార్టీలు డివిజన్లు వెదుక్కోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే ఆనం వివేకా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆనంకు కూడా అభ్యర్థుల వేట తప్పలేదు. తన మనుషులనుకున్న వారిని పిలిపించి ఈసారి మీరు పోటీ చేయాలని ఆయన బలవంతం చేసినా మాకొద్దు దేవుడో.. అంటూ వారు పారిపోతున్నట్లు నగరంలో ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులే గడువు ఉన్నా ఇప్పటిదాకా సుమారు 20 డివిజన్లలో అభ్యర్థులు దొరకలేదని తెలిసింది. దీనికి తోడు కాంగ్రెస్ తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దూకబోయే వారెవరో కూడా ప్రకటించలేని స్థితిలో కాంగ్రెస్ పడిపోయింది. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కొన్ని వార్డుల్లో ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసేవారే లేకుండాపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి కళ్లారా చూస్తున్న ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం ఎన్నికల్లో పోటీచేయాలని ఎవరినీ బలవంతం చేసే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ నేతలే టీడీపీ అభ్యర్థులు ఎవరొచ్చినా బుట్టలో తోసేయ్ అనేలా వలసలు సాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలే అభ్యర్థులుగా మారిపోతున్నారు. దీంతో పార్టీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం చెలరేగుతున్నాయి. నెల్లూరులో కార్పొరేటర్ల టికెట్ల వ్యవహారంలో ఇటీవలే పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డిల జోక్యం స్థానిక నేతలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీమంత్రి రమేష్‌రెడ్డి తదితరులు తమ సొంత మనుషులకు కూడా టికెట్ల విషయంలో ఎదురీతను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ గందరగోళం కారణంగా ఆ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేకపోతోంది. గూడూరులో ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌కు ఆయన వ్యతిరేకులకు మధ్య టికెట్ల వార్ రేగడంతో రెబెల్స్ మోగబోతున్నాయి. ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేటలో సైతం టికెట్ల విషయంలో అసమ్మతి సెగలు చిమ్ముతున్నాయి. చంద్రబాబు ఆదేశం మేరకు కాంగ్రెస్ నేతలకే పెద్దపీట వేస్తుండటాన్ని తెలుగుతమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు. ముందంజలో వైసీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంది. నె ల్లూరు మేయర్ అభ్యర్థిగా అజీజ్‌ను ప్రకటించారు. 54 డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అనేకమంది ప్రచారం కూడా ప్రారంభించారు. ఆత్మకూరు, కావలి, గూడూ రు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల్లో సైతం అభ్యర్థుల ఎంపిక 90శాతం పూర్తయ్యింది. -
ఎన్నిసార్లు మభ్యపెడతారు
గూడూరు టౌన్, న్యూస్‌లైన్: గూడూరులోని నరసింగరావు పేటలో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. మహానేత వైఎస్సార్ హయాంలో ఇళ్ల పట్టాలు అందజేస్తే, ఇప్పటికీ స్థలాలు చూపకపోవడంపై వారు నిలదీశారు. ఎన్నిసార్లు రచ్చబండ నిర్వహించి మభ్యపెడతారని ప్రశ్నించారు. మరోవైపు రచ్చబండకు మంత్రి ఆనం రావడం ఆలస్యం కావడంతో ప్రజల్లో ఓపిక నశించింది. మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన మంత్రి సాయంత్రం 4.45 గంటలకు వచ్చారు. ఆయన రాక ఆలస్యం కావడంతో ఎక్కువ మంది ప్రజలు అర్జీలను అధికారులకు ఇచ్చి వెళ్లిపోయారు. రామనారాయణరెడ్డి మాట్లాడుతున్న సమయంలోనూ ఎక్కువ మంది వెళ్లిపోతుండటంతో నాయకులు వారిని బలవంతంగా కూర్చోబెట్టారు. 47,972 మందికి ఇందిరమ్మ ఇళ్లు మూడో విడత రచ్చబండ పథకం ద్వారా జిల్లాలో 47,972 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గూడూరు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రితో చర్చించి గూడూరులో పీజీ కళాశాల ఏర్పాటుకు అనుమతి తెస్తామని హామీ ఇచ్చారు. 2009లో ఇళ్ల పట్టాలు మంజూరైన వారికి సాంకేతిక కారణాలతో భూమి చూపలేదని చెప్పారు. త్వరలోనే డీటీపీ అప్రూవల్ తీసుకుని లబ్ధిదారులకు స్థలాలు చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ దుగ్గరాజపట్నంలో ఏర్పాటైతే వందలాది పరిశ్రమలు వచ్చి, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేత పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ గూడూరులో రూ.20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గూడూరు ఆర్డీఓ మధుసూదన్‌రావు, తహశీల్దార్ మైత్రేయ, ఎంపీడీఓ నిర్మలదేవి, మున్సిపల్ కమిషనర్ సుశీలమ్మ, పీడీ కమలకుమారి, నాయకులు జగన్మోహన్రెడ్డి, శ్యామ్‌సుందరరెడ్డి పాల్గొన్నారు. చింతా వ్యాఖ్యలతో కలకలం తిరుపతి ఎంపీ చింతా మోహన్ మాటలు సభలో ఒక్కసారిగా కలకలం రేపాయి. గిరిజనులు గతంలో గోచీలు పెట్టుకుని తిరుగుతూ, ఎలుకలు తింటూ జీవనం సాగించేవారని, కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంటూ ఇప్పుడు అన్నం తింటున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అక్కడే ఉన్న పలువురు గిరిజనులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తాను 20 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటే, ఒక్కటీ సవ్యంగా సాగలేదని చింతా వ్యాఖ్యానించడం సైతం చర్చనీయాంశమైంది. -
పేదలకు మళ్లీ నిరాశే
సాక్షి, నెల్లూరు: పేదలను భూయజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పాలకులు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ అర్హులకు భూములు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆనం వారి పుణ్యమాని పేదోళ్లకు మరోసారి నిరాశే ఎదురుకానుంది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భూపంపిణీ మళ్లీ అధికార పార్టీ అనుయాయులకే పరిమితమవుతోంది. అందులోనూ పెద్దపీట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గానికే. పేరుకు ఉదయగిరి నియోజకవర్గానికి రెండో ప్రాధాన్యం ఇచ్చినా జాబితాలో పేర్లన్నీ అధికార పార్టీ నేతలు సూచించినవేనని తెలిసింది. జిల్లాలో సెంటుభూమి లేని నిరుపేదలు వేలాదిమంది ఉన్నారు. వీరంతా భూముల కోసం అర్జీలు చేత పట్టుకుని ప్రతివారం తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి విడతలోనూ తమకు భూములు దక్కుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీ అండ, పలుకుబడి లేకపోవడంతో పేదలకు నిరాశ తప్పడం లేదు. మరోవైపు దళితుల పేరుతో పట్టాల పంపిణీ జరిగినా ఆ భూములు మాత్రం అగ్రవర్ణాల వారి చేతిలోనే ఉంటున్నాయి. ఏడో విడత జాబితా సిద్ధం జిల్లాలో ఏడో విడతగా 4,212 మందికి 5,189 ఎకరాలు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో 1,500 ఎకరాలు ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజక వర్గంలో వెయ్యి ఎకరాలు ఎంపిక చేసినట్లు తెలిసింది. పేరుకు ఉదయగిరి నియోజకవర్గానికి వెయ్యి ఎకరాలుగా ప్రకటించినా లబ్ధిదారుల జాబితా అధికార పార్టీ నేతల సూచనల మేరకు తయారు చేసినట్టు సమాచారం. ఈ రెండు నియోజక వర్గాలకే 2,500 ఎకరాలు పోగా మిగిలిన సగం భూములను 8 నియోజక వర్గాల్లో పంపిణీ చేయనున్నారు. అంటే పంపిణీ అక్కడ నామమాత్రంగా జరగబోతోంది. ఆరో విడతలోనూ ఆత్మకూరుకే భూముల కోసం ఎదురుచూసిన వారికి ఏడో విడత పంపిణీ కార్యక్రమంలోనూ నిరాశ తప్పలేదు. 7,700 మందికి పది వేల ఎకరాలు పంపిణీ చేయగా అందులో 5 వేల ఎకరాలను ఆత్మకూరు నియోజకవర్గానికే కే టాయించారు. ఆ నియోజకవర్గంలోని మ ర్రిపాడు మండలంలో 1,262 మంది లబ్ధిదారులకు 3 వేల ఎకరాలు, సంగం మండలంలో 80 మందికి 60 ఎకరాలు, ఆత్మకూరు మండలంలో 137 మందికి 190 ఎకరాలు, ఏఎస్‌పేటలో 65 మందికి 90 ఎకరాలు, చేజ ర్ల లో 624 మందికి 530 ఎకరాలు. అనంతసాగరం మండలం లో 346 మందికి 440 ఎకరాలు పంపిణీ చేశారు. పట్టాలొచ్చినా దక్కని భూములు ఇప్పటి వరకు ఆరు విడతలుగా జరిగిన భూపంపిణీల్లో పేదలకు భూములు కేటాయించినా ఇంతవరకు లబ్ధిదారులందరికీ అవి ఎక్కడున్నాయో చూపలేదు. ప్రధానం గా 4,5,6 విడతల భూపంపిణీల ప్రక్రియల్లో పట్టాలు పంపిణీ చేసినా ఆ భూములు ఎక్కడున్నాయో తెలియక బాధితులు కా ర్యాలయాల చుట్టూ తిరిగితిరిగి విసిగివేసారిపోయారు. భూములను చూపాలని కోరుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం కరువైంది. మరోవైపు విలువైన ఆ భూములను కొందరు పెద్దలు కబ్జా చేసేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అర్హులైన పేదలకు భూములు దక్కేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
మంత్రా.. మజాకా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంట్రాక్టు పనుల కేటాయింపుల్లో నిబంధనలు కాదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అధికారులు జీ హుజూర్ అంటున్నారు. కోటి రూపాయల అంచనాలతో పిలిచిన టెండర్లకు ఇంకా నాలుగు రోజులు గడువు ఉండగానే అర్ధంతరంగా రద్దు చేశారు. అవే పనులను నామినేషన్ కోటాలో అధికార పార్టీ కార్యకర్తలకు పంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడో పిలవాల్సిన టెండర్లు చివరి నిమిషం వరకు నాన్చి ఇప్పుడు అత్యవసరం పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... సోమశిల ప్రాజెక్ట్ కింద దక్షిణ, ఉత్తర కాలువలతో పాటు కావలి కాలువ, వాటి లింక్ కాలువల్లో సిల్టు, నాచు తొలగింపునకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద కోటి రూపాయలు విడుదలయ్యాయి. ఈ పనులకు సెప్టెంబర్ 24న అనుమతి లభించింది. ప్రాజెక్ట్ నుంచి తొలి పంటకు ఇచ్చే నీరు సక్రమంగా చివరి వరకు చేరేందుకు వీలుగా మెయింటెనెన్స్ పనుల కోసం ఈ నిధులు కేటాయించారు. ఆ మేరకు రెండు రోజుల కిందట ఇరిగేషన్ అధికారులు టెండర్లు కూడా పిలిచారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు షెడ్యూళ్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. హఠాత్తుగా మంగళవారం టెండర్లు రద్దు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రకటించారు. దీనిపై ఆరా తీస్తే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. సోమశిల ప్రాజెక్ట్ నుంచి కాలువలకు నీరు విడుదల చేసేందుకు బుధవారం మధ్యాహ్నం ముహూర్తంగా నిర్ణయించారు. సోమశిలలో గంగమ్మ పూజలు నిర్వహించిన తరువాత నీటిని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించేందుకు సమయం పడుతున్నందున నామినేషన్ కింద పనులు కేటాయించాలని మంత్రి ఆదేశించినట్టు తెలిసింది. సాంకేతికంగా తప్పు లేదని అనిపించుకునేందుకు పనుల అంచనా విలువను ఐదు లక్షల రూపాయలకు మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో మెయింటెనెన్స్ పనులను సాగునీటి సంఘాలకు అప్పగించేవారు. ఇప్పుడు సాగునీటి సంఘాలు లేకపోవడంతో ఆరోపణలకు జడిసి ఆయా కాలువల కింద రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి పనులు అప్పగించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఇవన్ని ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. రైతులతో కమిటీలు నియమించేందుకు కనీసం వారమైనా పడుతుంది. నిజమైన కమిటీలు ఏర్పాటు చేసేందుకు వారం రోజులు పడుతుండగా ఇప్పటికే పిలిచిన టెండర్లకు గడువు నాలుగు రోజులు మాత్రమే ఉంది. అంటే ఈ కమిటీల నియామకం మొత్తం బూటకమని స్పష్టమవుతోంది. మంత్రి రామనారాయణరెడ్డి, అధికారపార్టీ నేతలు సూచించిన వారికి పనులు కట్టబెట్టేందుకు రైతులతో కమిటీలు అన్న కొత్త నాటకానికి తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ముందు కాలువల్లో సిల్టు, నాచు తొలగింపు ఏటా జరిగేదే. దీని గురించి చివరి నిమిషం వరకు మీనమేషాలు లెక్కించి ఇప్పుడు నామినేషన్ల కింద కాంగ్రెస్ కార్యకర్తలకు పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. -
మంత్రి ఇలాకాలో మరణమృదంగం
ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ‘వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆత్మకూరును అభివృద్ధి చేస్తున్నా.ప్రజలకు తాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం’ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తరచూ చెప్పే మాటలివి. అయితే ఆయన జమానాలోనే జనం స్వచ్ఛమైన తాగునీటికి వెంపర్లాడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో గరళంలాంటి ఫ్లోరిన్ నీటిని తాగి రోగాల పాలవుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకొని జీవచ్ఛవాల్లా మారుతున్నారు. కాళ్లు, కీళ్లు, నడుం నొప్పులు, కిడ్నీ వ్యాధులతో మంచం పట్టి జీవ న్మరణపోరాటం చేస్తున్నారు. ఆత్మకూరు మండలంలో పడకండ్లలో ప్రజల కడగండ్లు ఇవి. పడకండ్ల పంచాయతీలో బొటికర్లపాడు, గండ్లవీడు, యర్రబల్లి, పడకండ్ల గ్రామాలున్నాయి. పడకండ్ల పంచాయతీ ప్రధాన కేంద్రమే అయినా గ్రామంలో గుక్కెడు నీటికి కరువే. గ్రామంలో 115 కుటుంబాలుంటాయి. బోర్లు, రక్షిత మంచినీటి పథకం ఉన్నాయి. అయితే బోర్లు, మంచి నీటిపథకం నుంచి ఫ్లోరిన్ నీరు సరఫరా అవుతోంది. నిత్యం ఉపయోగించుకోడానికి, తాగేందుకు కూడా ఆ నీరే గతి. గ్రామంలో వ్యవసాయం, కూలి పనులపైనే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. ఒక తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసినా అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ తాగునీటి పథకం కోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. పైప్లైన్లు ఏర్పాటు చేశారు. కాని దాని గురించి పట్టించుకోలేదు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు కీళ్లు, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. పళ్లు గారపట్టి ఉన్నాయి. ఇలా రకరకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. పలువురు రోగాల పాలు గత కొన్నేళ్లుగా ఫ్లోరిన్ నీరు తాగి స్థానికులు రోగాల పాలవుతున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామంలో సుమారు 20 మంది వరకు మూత్రపిండాల వ్యాధులకు గురైన వారున్నట్టు అంచనా. గామానికి చెందిన అమ్మన బోయిన వెంగయ్య(45) బొగ్గుకాల్చేపనికి వెళ్లి పొట్ట పోసుకుంటుంటాడు. రెండేళ్ల క్రితం మూత్రపిండాల వ్యాధి బారిన పడ్డాడు. దీంతో అక్కడ ఇక్కడ అప్పులు చేసి వ్యాధి నయం చేయించుకునేందుకు నెల్లూరుకు తిరుగుతున్నాడు. వారానికి రెండుసార్లు ఆయన డయాలసిస్ చేయించుకునేందుకు నెల్లూరు వె ళ్తాడు. పూటగడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ మాయదారి కిడ్నీవ్యాధులు జీవితాల్ని ఛిద్రం చేస్తున్నాయని గ్రామస్తుల ఆవేదన. పలువురు మృత్యువాత ఈయన పేరు ఐతా పెద లక్ష్మయ్య (45). ఐదేళ్ల క్రితం మూత్రపిండాల వ్యాధి బారిన పడ్డాడు. అప్పటి నుంచి వైద్యం కో సం పలు ఆస్పత్రుల చు ట్టూ తిరిగాడు. ఐదేళ్లు జీవన్మరణ పోరాటం చేసి గత నెల ఐదో తేదీన మృత్యువాత పడ్డాడు. ఆయన వ్యాధి నయం చేయించేందుకు సుమారు రూ.నాలుగు లక్షలకు పైగా ఖర్చు పెట్టామని, అయినా మనిషి దక్కలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈయన పేరు సింగారెడ్డి రామిరెడ్డి. యాభయ్యో ఏట మూత్రపిండాలు పని చేయడంలేదని పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ఆయన మంచంలోనే గడి పాడు. పదేళ్ల పాటు జీవన్మరణ పోరాటం చేసి 2008వ సంవత్సరంలో చనిపోయాడు. బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు. ఐదారు లక్షలు ఖర్చుపెట్టినా దక్కించుకోలేకపోయామని కుటుంబసభ్యులు తెలిపారు. తాగునీటికి రోజుకు రూ.2 వేలు ఖర్చు ఫ్లోరిన్ నీరు తాగి రోగాల పాలవుతుండటంతో కొద్దిగా స్తోమత కలిగిన 40 కుటుంబాలు వింజమూరు నుంచి క్యాన్ నీరు తెప్పించుకుంటున్నాయి. ఒక్కో క్యాన్ రూ.15. రోజుకు ఒక్కో కుటుంబం మూడు లేదా నాలుగు క్యాన్ల నీరు తెప్పించుకుంటుంది. 40 కుటుంబాలు రోజుకు తాగునీటి కోసం సుమారు రూ.1800 నుంచి రూ.2వేలు ఖర్చు పెడుతున్నట్టు అంచనా. అంటే నెలకు సుమారు రూ.60 వేలు తాగునీటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక స్తోమత లేని ఫ్లోరిన్ నీరే తాగి బతుకీడుస్తున్నారు. నెలకు ఐదువేలు ఖర్చు సంవత్సరం క్రితం మూత్రపిండాలు సక్రమంగా పని చేయడంలేదని తేలింది. అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా. నెలకోసారి నెల్లూరుకు వెళ్లి ఆస్పత్రిలో చూపించుకుని వస్తున్నా. మందులు, ప్రయాణ ఖర్చులు అన్నీ కలిపి రూ.5 వేలకు పైన అవుతోంది. ఏం చేస్తాం, తప్పదు. ఈ మాయదారి నీళ్లు తాగి రోగాలొస్తున్నాయి. -యనమల సంజీవమ్మ, పడకండ్ల మోకాళ్ల నొప్పులతో సతమతం మోకాళ్లు, కీళ్ల నొప్పుల బాధ అంతా ఇం తా కాదు. నెల్లూరు, కావలి ప్రాంతాల్లోని ఆస్పత్రుల చుట్టూ తిరిగా. క్యాన్ నీరు తెచ్చుకుని తాగే స్తోమత లేదు. నీరు విషమని తెలిసినా తాగక తప్పడం లేదు. మోకాళ్ల నొప్పులు నయం చేయించుకునేందుకు పదివేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టా. గుక్కెడు మంచినీళ్లు అం దించి పుణ్యం కట్టుకోండి. -మద్దిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, పడకండ్ల