సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంగ్రెస్ పార్టీని తాము బతికించుకుంటామని ప్రకటించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సొంత జిల్లా నెల్లూరులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు ఆనం సోదరులు శాసించిన నెల్లూరు కార్పొరేషన్‌లో సైతం పూర్తిస్థాయిలో అభ్యర్థులను బరిలోకి దించుకునేందుకు వారు మున్సి ‘పల్టీ’లు కొడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారే టీడీపీ అభ్యర్థులుగా మారుతుండటంతో ఆ పార్టీలో తిరుగుబాట్ల స్వరం వినిపిస్తోంది.
మార్చిలో జరగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు మున్సిపల్, స్థానిక ఎన్నికలను రాజకీయ పార్టీలు సెమీఫైనల్‌గా తీసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజే కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో విస్తృత స్థాయి సమావేశం జరిపింది. కార్పొరేషన్‌లోని 54 డివిజన్లకు తమ అభ్యర్థులు ఖరారైపోయారనీ, మిగిలిన పార్టీలు డివిజన్లు వెదుక్కోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే ఆనం వివేకా విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆనంకు కూడా అభ్యర్థుల వేట తప్పలేదు. తన మనుషులనుకున్న వారిని పిలిపించి ఈసారి మీరు పోటీ చేయాలని ఆయన బలవంతం చేసినా మాకొద్దు దేవుడో.. అంటూ వారు పారిపోతున్నట్లు నగరంలో ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులే గడువు ఉన్నా ఇప్పటిదాకా సుమారు 20 డివిజన్లలో అభ్యర్థులు దొరకలేదని తెలిసింది.
దీనికి తోడు కాంగ్రెస్ తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దూకబోయే వారెవరో కూడా ప్రకటించలేని స్థితిలో కాంగ్రెస్ పడిపోయింది. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కొన్ని వార్డుల్లో ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసేవారే లేకుండాపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి కళ్లారా చూస్తున్న ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం ఎన్నికల్లో పోటీచేయాలని ఎవరినీ బలవంతం చేసే పరిస్థితుల్లో లేరు.
కాంగ్రెస్ నేతలే టీడీపీ అభ్యర్థులు
ఎవరొచ్చినా బుట్టలో తోసేయ్ అనేలా వలసలు సాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలే అభ్యర్థులుగా మారిపోతున్నారు. దీంతో పార్టీ సీనియర్లలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం చెలరేగుతున్నాయి. నెల్లూరులో కార్పొరేటర్ల టికెట్ల వ్యవహారంలో ఇటీవలే పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డిల జోక్యం స్థానిక నేతలకు ఏ మాత్రం మింగుడు పడటం లేదు.
ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీమంత్రి రమేష్‌రెడ్డి తదితరులు తమ సొంత మనుషులకు కూడా టికెట్ల విషయంలో ఎదురీతను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ గందరగోళం కారణంగా ఆ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేకపోతోంది. గూడూరులో ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌కు ఆయన వ్యతిరేకులకు మధ్య టికెట్ల వార్ రేగడంతో రెబెల్స్ మోగబోతున్నాయి. ఆత్మకూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేటలో సైతం టికెట్ల విషయంలో అసమ్మతి సెగలు చిమ్ముతున్నాయి. చంద్రబాబు ఆదేశం మేరకు కాంగ్రెస్ నేతలకే పెద్దపీట వేస్తుండటాన్ని తెలుగుతమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు.
ముందంజలో వైసీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంది. నె ల్లూరు మేయర్ అభ్యర్థిగా అజీజ్‌ను ప్రకటించారు. 54 డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అనేకమంది ప్రచారం కూడా ప్రారంభించారు. ఆత్మకూరు, కావలి, గూడూ రు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల్లో సైతం అభ్యర్థుల ఎంపిక 90శాతం పూర్తయ్యింది.
టీడీపీ- కాంగ్రెస్ మున్సి‘పల్టీ’లు
Published Wed, Mar 12 2014 3:47 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
Advertisement
Advertisement