పేదలను భూయజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పాలకులు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ అర్హులకు భూములు దక్కే పరిస్థితి కనిపించడం లేదు.
సాక్షి, నెల్లూరు: పేదలను భూయజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పాలకులు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ అర్హులకు భూములు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆనం వారి పుణ్యమాని పేదోళ్లకు మరోసారి నిరాశే ఎదురుకానుంది. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భూపంపిణీ మళ్లీ అధికార పార్టీ అనుయాయులకే పరిమితమవుతోంది. అందులోనూ పెద్దపీట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గానికే.
పేరుకు ఉదయగిరి నియోజకవర్గానికి రెండో ప్రాధాన్యం ఇచ్చినా జాబితాలో పేర్లన్నీ అధికార పార్టీ నేతలు సూచించినవేనని తెలిసింది. జిల్లాలో సెంటుభూమి లేని నిరుపేదలు వేలాదిమంది ఉన్నారు. వీరంతా భూముల కోసం అర్జీలు చేత పట్టుకుని ప్రతివారం తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రతి విడతలోనూ తమకు భూములు దక్కుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీ అండ, పలుకుబడి లేకపోవడంతో పేదలకు నిరాశ తప్పడం లేదు. మరోవైపు దళితుల పేరుతో పట్టాల పంపిణీ జరిగినా ఆ భూములు మాత్రం అగ్రవర్ణాల వారి చేతిలోనే ఉంటున్నాయి.
ఏడో విడత జాబితా సిద్ధం
జిల్లాలో ఏడో విడతగా 4,212 మందికి 5,189 ఎకరాలు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో 1,500 ఎకరాలు ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజక వర్గంలో వెయ్యి ఎకరాలు ఎంపిక చేసినట్లు తెలిసింది. పేరుకు ఉదయగిరి నియోజకవర్గానికి వెయ్యి ఎకరాలుగా ప్రకటించినా లబ్ధిదారుల జాబితా అధికార పార్టీ నేతల సూచనల మేరకు తయారు చేసినట్టు సమాచారం. ఈ రెండు నియోజక వర్గాలకే 2,500 ఎకరాలు పోగా మిగిలిన సగం భూములను 8 నియోజక వర్గాల్లో పంపిణీ చేయనున్నారు. అంటే పంపిణీ అక్కడ నామమాత్రంగా జరగబోతోంది.
ఆరో విడతలోనూ ఆత్మకూరుకే
భూముల కోసం ఎదురుచూసిన వారికి ఏడో విడత పంపిణీ కార్యక్రమంలోనూ నిరాశ తప్పలేదు. 7,700 మందికి పది వేల ఎకరాలు పంపిణీ చేయగా అందులో 5 వేల ఎకరాలను ఆత్మకూరు నియోజకవర్గానికే కే టాయించారు. ఆ నియోజకవర్గంలోని మ ర్రిపాడు మండలంలో 1,262 మంది లబ్ధిదారులకు 3 వేల ఎకరాలు, సంగం మండలంలో 80 మందికి 60 ఎకరాలు, ఆత్మకూరు మండలంలో 137 మందికి 190 ఎకరాలు, ఏఎస్‌పేటలో 65 మందికి 90 ఎకరాలు, చేజ ర్ల లో 624 మందికి 530 ఎకరాలు. అనంతసాగరం మండలం లో 346 మందికి 440 ఎకరాలు పంపిణీ చేశారు.
పట్టాలొచ్చినా దక్కని భూములు
ఇప్పటి వరకు ఆరు విడతలుగా జరిగిన భూపంపిణీల్లో పేదలకు భూములు కేటాయించినా ఇంతవరకు లబ్ధిదారులందరికీ అవి ఎక్కడున్నాయో చూపలేదు. ప్రధానం గా 4,5,6 విడతల భూపంపిణీల ప్రక్రియల్లో పట్టాలు పంపిణీ చేసినా ఆ భూములు ఎక్కడున్నాయో తెలియక బాధితులు కా ర్యాలయాల చుట్టూ తిరిగితిరిగి విసిగివేసారిపోయారు. భూములను చూపాలని కోరుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం కరువైంది.
మరోవైపు విలువైన ఆ భూములను కొందరు పెద్దలు కబ్జా చేసేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అర్హులైన పేదలకు భూములు దక్కేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.