కాంట్రాక్టు పనుల కేటాయింపుల్లో నిబంధనలు కాదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అధికారులు జీ హుజూర్ అంటున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాంట్రాక్టు పనుల కేటాయింపుల్లో నిబంధనలు కాదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇచ్చిన ఆదేశాలకు అధికారులు జీ హుజూర్ అంటున్నారు. కోటి రూపాయల అంచనాలతో పిలిచిన టెండర్లకు ఇంకా నాలుగు రోజులు గడువు ఉండగానే అర్ధంతరంగా రద్దు చేశారు. అవే పనులను నామినేషన్ కోటాలో అధికార పార్టీ కార్యకర్తలకు పంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడో పిలవాల్సిన టెండర్లు చివరి నిమిషం వరకు నాన్చి ఇప్పుడు అత్యవసరం పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... సోమశిల ప్రాజెక్ట్ కింద దక్షిణ, ఉత్తర కాలువలతో పాటు కావలి కాలువ, వాటి లింక్ కాలువల్లో సిల్టు, నాచు తొలగింపునకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద కోటి రూపాయలు విడుదలయ్యాయి.
ఈ పనులకు సెప్టెంబర్ 24న అనుమతి లభించింది. ప్రాజెక్ట్ నుంచి తొలి పంటకు ఇచ్చే నీరు సక్రమంగా చివరి వరకు చేరేందుకు వీలుగా మెయింటెనెన్స్ పనుల కోసం ఈ నిధులు కేటాయించారు. ఆ మేరకు రెండు రోజుల కిందట ఇరిగేషన్ అధికారులు టెండర్లు కూడా పిలిచారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు షెడ్యూళ్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. హఠాత్తుగా మంగళవారం టెండర్లు రద్దు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రకటించారు. దీనిపై ఆరా తీస్తే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది.
సోమశిల ప్రాజెక్ట్ నుంచి కాలువలకు నీరు విడుదల చేసేందుకు బుధవారం మధ్యాహ్నం ముహూర్తంగా నిర్ణయించారు. సోమశిలలో గంగమ్మ పూజలు నిర్వహించిన తరువాత నీటిని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించేందుకు సమయం పడుతున్నందున నామినేషన్ కింద పనులు కేటాయించాలని మంత్రి ఆదేశించినట్టు తెలిసింది.
సాంకేతికంగా తప్పు లేదని అనిపించుకునేందుకు పనుల అంచనా విలువను ఐదు లక్షల రూపాయలకు మించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో మెయింటెనెన్స్ పనులను సాగునీటి సంఘాలకు అప్పగించేవారు. ఇప్పుడు సాగునీటి సంఘాలు లేకపోవడంతో ఆరోపణలకు జడిసి ఆయా కాలువల కింద రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి పనులు అప్పగించాలని నిర్ణయించారు. వాస్తవానికి ఇవన్ని ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. రైతులతో కమిటీలు నియమించేందుకు కనీసం వారమైనా పడుతుంది.
నిజమైన కమిటీలు ఏర్పాటు చేసేందుకు వారం రోజులు పడుతుండగా ఇప్పటికే పిలిచిన టెండర్లకు గడువు నాలుగు రోజులు మాత్రమే ఉంది. అంటే ఈ కమిటీల నియామకం మొత్తం బూటకమని స్పష్టమవుతోంది. మంత్రి రామనారాయణరెడ్డి, అధికారపార్టీ నేతలు సూచించిన వారికి పనులు కట్టబెట్టేందుకు రైతులతో కమిటీలు అన్న కొత్త నాటకానికి తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ముందు కాలువల్లో సిల్టు, నాచు తొలగింపు ఏటా జరిగేదే. దీని గురించి చివరి నిమిషం వరకు మీనమేషాలు లెక్కించి ఇప్పుడు నామినేషన్ల కింద కాంగ్రెస్ కార్యకర్తలకు పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.