సాక్షి, అనంతపురం : అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏసీ తరగతి గదులు, ఇతర హంగులతో ఓ ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలకు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది.
అయితే... పదో తరగతి అడ్మిషన్లు కూడా చేసుకున్నారు. మొత్తం 15 మంది విద్యార్థులు ఇక్కడ పదో తరగతి చదువుతున్నారు. వీరికి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఆ పాఠశాల యాజమాన్యం రాంనగర్‌లోని ‘గుర్తింపు’ ఉన్న మరో పాఠశాలలో పేర్లు నమోదు చేయించి... రెగ్యులర్ విద్యార్థులుగా పరీక్షలు రాయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విద్యార్థుల నుంచి భారీగానే వసూలు చేసింది. కేవలం ఈ పాఠశాలలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా అనేక విద్యాసంస్థలలో అడ్మిషన్ల దందా కొనసాగుతోంది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే అన్ని తరగతుల్లో విద్యార్థులను చేర్చుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల సమయంలో దొడ్డిదారులను వెతుకుతున్నారు. గుర్తింపు ఉన్న పాఠశాలల్లో ‘రెగ్యులర్’గా చదివినట్లు చూపుతూ... పరీక్షలు రాయిస్తున్నారు.
కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై తల్లిదండ్రులకూ ఏయేటికాయేడు మోజు పెరుగుతూనే ఉంది. వాటిలో చదివితే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేది వారి ఆశ. ఆర్థిక స్థోమత లేకపోయినా కూలీలు, ఆటోడ్రైవర్లు సైతం నానా అవస్థలు పడి రూ.వేలకు వేలు ఫీజులు చెల్లించి తమ పిల్లలను ఆ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వాటి యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 762 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 217 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇందులో గుర్తింపులేనివి 53 ఉన్నట్లు విద్యాశాఖ రికార్డులు చెబుతున్నాయి.
గుర్తింపు లేని పాఠశాలల్లో పదో తరగతికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.20-25 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షల సమయంలో మరో రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు దండుకుంటున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని విద్యార్థులు ‘రెగ్యులర్’గానే పరీక్షలు రాస్తారు. వీరికి ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు రూ.125. కానీ.. వాటి నిర్వాహకులు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,350కు పైగా దండుకుంటున్నారు. ‘గుర్తింపు’ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం దాదాపు 13 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన వాటి యాజమాన్యాలు ఏ మేరకు సొమ్ము చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.
గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం
తమ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు లేదనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం తెలియనివ్వడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా వేరే పాఠశాలల్లో బోగస్ హాజరు వేయించి.. వాటి నుంచే విద్యార్థులను పరీక్షలకు పంపడానికి రంగం సిద్ధం చేశారు. ఇలా పరీక్షలు రాస్తే ఆ విద్యార్థి ఉత్తీర్ణత సాధించిన తరువాత మార్కుల జాబితా, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, స్టడీ, కాండక్టు సర్టిఫికెట్లు ‘వేరే పాఠశాల’ మీదుగానే వస్తాయి. కార్పొరేట్, పేరెన్నికగల పాఠశాలలో చదివినట్లు గుర్తింపు ఉండదు. కాదు..కూడదనుకుంటే ‘ప్రైవేటు’ విద్యార్థులుగానే పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ద్వారా పరీక్షలకు హాజరైతే స్టడీ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉండదు.
ప్రస్తుతం ప్రభుత్వ పరంగా చాలా ఉద్యోగాలకు అభ్యర్థులను ‘లోకల్ ఏరియా’గా పరిగణించాలంటే స్థానికంగా కనీసం ఐదేళ్ల పాటు చదివి ఉండాలనే నిబంధన ఉంది. ప్రైవేటుగా పరీక్ష రాసినప్పుడు ఆ ధ్రువపత్రం పాఠశాల నుంచి తీసుకునే అవకాశం లేదు. అప్పుడు రెవెన్యూ పరంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అందుకు నానా అవస్థలు పడాలి. అంటే విద్యాసంస్థలు చేస్తున్న మోసాలకు విద్యార్థులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్మిషన్ల దందా గురించి తెలిసినా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
గుర్తింపులేని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు గుర్తింపు ఉన్న విద్యాసంస్థలలో బోగస్ హాజరుతో రెగ్యులర్ విద్యార్థులుగా నమోదవుతున్నారు. అందుకు ఆ పాఠశాలల యాజమాన్యాలు గుర్తింపు ఉన్న విద్యాసంస్థలకు ఒక్కొక్క విద్యార్థిపై రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నాయి. నిబంధనల ప్రకారమైతే గుర్తింపులేని పాఠశాలల విద్యార్థులు ‘ప్రైవేటు’గా పరీక్షలు రాయాలి. అందుకు ప్రభుత్వానికి హాజరు మినహాయింపు కింద రూ.650, పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూపంలోనూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ విద్యావ్యవస్థనే భ్రష్టుపట్టిస్తున్నారు.
అడ్మిషన్ల దందా
Published Wed, Nov 20 2013 3:11 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement