ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా, అందుకు ఇష్టం లేని ప్రియుడు ఆమెను హత్య చేసి పరారయ్యాడు.
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని కోరగా, అందుకు ఇష్టం లేని ప్రియుడు ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ వెస్ట్ ఏసీపీ హరికృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుంటుపల్లిలో పాడుబడిన క్రషర్ వద్ద యువతి మృతదేహం ఉందని గతనెల 30న పోలీసులకు సమాచారం అందింది.
వారు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. అక్కడ లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా మృతురాలు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన ఎద్దనపూడి కవిత(23)గా గుర్తిం చారు. దీనిపై దర్యాప్తు కొనసాగించగా, జిల్లాలోని చాట్రాయికి చెందిన శింగపాము జయరామ్(22)ను ఆమె ప్రేమించినట్లు తేలింది. జయరామ్ చిట్యాలలో ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో అతడికి కవితతో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. తరువాత జయరామ్ స్వగ్రామం తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా, అతడు కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతనెల 25న ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు.
మరుసటిరోజు విజయవాడలో కలుసుకున్నారు. నగరంలో పలు ప్రాం తాల్లో తిరిగి, చివరకు గుంటుపల్లి వద్ద జన సంచారం లేని పాడు బడిన క్రషర్ వద్దకు చేసుకున్నారు. ఆమె పెళ్లి చేసు కోవాలని కోరింది. దీంతో మాటా మాటా పెరిగి గొడవ పడ్డారు. అప్పటి కే ఆమెను చంపాలని నిర్ణయిం చు కున్నాడు. గొడవ ముదరడంతో కవిత మెడకు చున్నీని బిగించి ఊపిరాడకుండా చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక చెన్నైలో స్నేహితుడి వద్దకు పారిపోయాడు.
ఈ ఘటనపై పోలీసులు ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు అనంతరం హత్య కేసుగా మార్చి జయరామ్‌ను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ కనకారావు, ఎస్సై వాసిరెడ్డి శ్రీను, సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ, ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.