కొండమల్లేపల్లి (నల్గొండ), న్యూస్‌లైన్ : నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన గోలి కవిత హత్యకేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం స్థానిక విలేకరుల ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్ల మండలం అనుములవీడు గ్రామానికి చెందిన బాలకృష్ణ దేవరకొండలోని ఖాదర్ కళాశాలలో గతేడాది ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే తన జూనియర్ అయిన పట్టణానికి చెందిన రాములు కూతురు గోలి కవితతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం ఇరువురూ ప్రేమించుకున్నారు. ఇటీవల కవితకు పెళ్లి కుదరింది. నిశ్చితార్థం కూడా జరగడంతో వారిద్దరి మధ్య విభేదాలొచ్చాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఒప్పుకున్న కవిత.. బాలకృష్ణను దూరం పెట్టింది.
దీంతో ఆమెపై బాలకృష్ణ కక్ష గట్టాడు. పథకం ప్రకారం హత్య చేయాలని భావించాడు. ఈ నెల 11న దేవరకొండకు వచ్చిన అతను కవితకు ఫోన్ చేసి నీతో ఒకసారి మాట్లాడాలని చెప్పి, పట్టణానికి సమీపంలో ఉన్న కాసారం గుట్టల్లోకి తీసుకెళ్లాడు. పెళ్లి విషయంలో వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని కవితను ప్రేరేపించాడు. ముందస్తుగా వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందును ఆమెతో బలవంతంగా తాగించాడు. కవిత అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవడంతో చావలేదని నిర్ధారించుకున్న బాలకృష్ణ కత్తితో గొంతు కోశాడు. పోలీసులను నమ్మించడానికి తను కూడా తక్కువ మోతాదులో క్రిమిసంహారక మందు తాగాడు. మళ్లీ బైక్‌పై పట్టణానికి తిరిగి వచ్చాడు.
ఖాదర్ కళాశాల అధ్యాపకుడైన శ్రవణ్ వద్దకు వెళ్లి తాను విషం తాగినట్టు చెప్పి సృ్పహ కోల్పోయాడు. దీంతో అతను బాలకృష్ణను ఆస్పత్రికి చేర్చాడు. కాసారం గుట్టలో యువతి హత్య విషయం వెలుగులోకి రావడం.. బాలకృష్ణ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో అతనిపై విచారణ జరిపారు. కవితను తానే హత్య చేసినట్లు బాలకృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రవణ్ మానవతా దక్పథంతోనే బాలకృష్ణను ఆస్పత్రిలో చేర్చాడని, హత్య తనకు విషయం తెలియదని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడిపై నిర్భయచట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు తెలిపా రు. సమావేశంలో డీఎస్పీ సోమశేఖర్, సీఐ భాస్కర్, ఎస్‌ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
కవిత హత్య కేసు నిందితుని అరెస్టు
Published Thu, Nov 21 2013 5:04 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Advertisement