
వైఎస్‌పై ప్రవాసాంధ్రుల అభిమానం ఎనలేనిది
మంగళగిరి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రవాసాంధ్రులు చూపిస్తున్న అభిమానం మరువలేనిదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. అమెరికాలో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే ఇటీవల అమెరికా వె ళ్లారు. ఈనెల ఏడో తేదీన ఫిలడెల్ఫియాలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే ఆర్కే ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడుతూ అమెరికాలో సైతం ప్రవాసాంధ్రులు వైఎస్సార్ వర్ధంతి భారీ ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. సుమారు రెండు వేల మందికి పైగా వైఎస్సార్ అభిమానులు రక్తాన్ని దానం చేశారని తెలిపారు. వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రవాసాంధ్రులు కృషి చేయాలని కోరారు.
దీనికి తన వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని ఫౌండేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఫౌండేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఆర్కే, ముస్తాఫాలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.