ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గంటలోనే రెండుసార్లు వాయిదా పడ్డాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై విపక్షం నిరసనలు, ఆందోళనలతో ఏపీ అసెంబ్లీ మంగళవార దద్దరిల్లింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గంటలోనే రెండుసార్లు వాయిదా పడ్డాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై విపక్షం నిరసనలు, ఆందోళనలతో ఏపీ అసెంబ్లీ మంగళవార దద్దరిల్లింది. ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలతో సభను హోరెత్తించారు.
ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన విషయం తెలిపిందే. వాయిదా తీర్మానంపై చర్చకు ప్రతిపక్షం పట్టుబట్టడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దాంతో స్పీకర్ తొలుత సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ పట్టువీడలేదు.
చర్చకు అనుమతించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు జోక్యం చేసుకుని బడ్జెట్ సమావేశాల్లో వాయిదా తీర్మానాలకు అనుమతించరని తెలిపారు. ఛార్జీల పెంపుపై సభలో సీఎం ప్రకటన చేసేందుకు సిద్ధమేనని, అయితే చర్చకు మాత్రం అనుమతించేది లేదన్నారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో స్పీకర్ మరో 15 నిమిషాలు అసెంబ్లీని వాయిదా వేశారు.