'పుష్కరాలకు 11 వందల కోట్లు ఖర్చవుతుంది'
రాజమండ్రి: వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. వారంలోగా తేదీలు ఖరారు చేస్తామన్నారు. పుష్కరాలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం రాజమండ్రిలో సమావేశమైంది. పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ నిర్మించాలని అనే అంశంపై చర్చించినట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం రూ. 11 వందల కోట్లు ఖర్చఅవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.
గతంలో జరిగిన గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు ఖర్చు అయిందని గుర్తు చేశారు. పెద్ద దేవాలయాలు, ఆదాయం వచ్చే దేవాలయాల నిధులను కూడా సమీకరించి ఈ పుష్కరాల కోసం ఖర్చు చేస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. ఈ సమవేశానికి మంత్రులు చిన్నరాజప్ప, నారాయణ తదితరులు హాజరయ్యారు.