
ఏపీ సీఎంకు సౌత్ హెచ్ బ్లాక్
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం సౌత్ హెచ్ బ్లాకు ముస్తాబవుతోంది. గవర్నర్ నర్సింహన్ స్వయంగా ఆదివారం సచివాలయం వచ్చి బ్లాకులను సందర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాలకు మేరకు బ్లాకుల విభజనతో పాటు బ్లాకుల ముస్తాబు కసరత్తును అధికారులు సోమవారం నుంచే ప్రారంభించారు. సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకును ఆంధ్రప్రదేశ్ సీఎం, సీఎస్, సీఎం కార్యాలయ అధికారులకు కేటాయించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ బ్లాకులో ఉన్న ఆంధ్రా బ్యాంకును ఎల్ బ్లాకుకు తరలించాలని నిర్ణయించారు. పది రోజుల్లోగా ఆ పని పూర్తి చేయాలని బ్యాంకుకు నోటీసులు జారీ చేశారు. జె బ్లాకు వెనుకనున్న ఆంధ్రాబ్యాంకు ఇటీవలే లక్షల రూపాయల వ్యయం చేసి సౌత్ హెచ్ బ్లాకులో నిర్మాణాలను చేపట్టి అక్కడికి మారింది. కేవలం నెలల వ్యవధిలోనే మళ్లీ ఎల్ బ్లాకుకు తరలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సౌత్ హెచ్ బ్లాకులో ప్రస్తుతం ఆంధ్రాబ్యాంకు ఉన్న వైపు నుంచే ఆ బ్లాకులోకి సీఎం, సీఎస్, సీఎం కార్యాలయ అధికారులకు రాకపోకలకు ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సౌత్ హెచ్ బ్లాకుకు ప్రధాన ద్వారం జి బ్లాకు ముందు నుంచి ఉంది. జి బ్లాకు శిధిలావస్థలో ఉండటంతో పాటు జి బ్లాకు ముందు ప్రధాన ద్వారం వద్ద వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదు. ఈ నేపథ్యంలో సౌత్ హెచ్ బ్లాకు ప్రధాన ద్వారాన్ని ఆంధ్రాబ్యాంకు వైపు ఏర్పాటు చేస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా గ్రీన్‌లాండ్ అతిథి గృహాన్ని కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నర్సింహన్ సోమవారం సాయంత్రం గ్రీన్‌లాండ్ అతిథి గృహం వెళ్లి పరిశీలన చేశారు. ఆయనతోపాటు సీఎస్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా గ్రీన్‌లాండ్‌ను తీర్చిదిద్దడానికి గవర్నర్ తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సౌత్. నార్త్ హెచ్ బ్లాకులను, జె, కె, ఎల్ బ్లాకులను కేటాయించాలని నిర్ణయించగా.. తెలంగాణ ప్రభుత్వానికి ఎ,బి,సి, డి బ్లాకులను కేటాయించాలని నిర్ణయించారు.