బాబుగారి దసరా సరదా.. 20 కోట్ల ఛాంబర్!
దసరా పండుగ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరదా పడ్డారు. సచివాలయంలోని కొత్త ఛాంబర్లోకి పూజలు చేసి మరీ అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా మాత్రమే ఉన్న హైదరాబాద్లోని సచివాలయం ఎల్ బ్లాకులో ఆయన కోసం ఏర్పాటుచేసిన ఛాంబర్ సొగసులకు అయిన ఖర్చు.. దాదాపు 20 కోట్ల రూపాయలకు పైమాటే!! వాస్తు పేరు చెప్పి ఈ ఛాంబర్లో చేసిన మార్పు చేర్పులు అన్నీ ఇన్నీ కావు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు లేక్వ్యూ గెస్ట్హౌస్నే తాత్కాలికంగా తన ఛాంబర్గా ఉపయోగించుకుంటూ వస్తున్నారు తప్ప సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. తొలుత హెచ్ బ్లాక్లో ఒక ఛాంబర్ను బాబుగారి కోసం సిద్ధం చేశారు. కానీ అక్కడ వాస్తు బాగోలేదన్న కారణంతో చంద్రబాబు అసలు అక్కడ అడుగే పెట్టలేదు.
తర్వాత మళ్లీ ఎల్ బ్లాకులోని ఎనిమిదో అంతస్థులో ఛాంబర్ను ఆయనకోసం ఏరికోరి ఎంపిక చేశారు. దీంట్లో కూడా ఆయన 'అవసరం' అనుకున్న మార్పు చేర్పులు చేయడానికే దాదాపు 20 కోట్ల రూపాయలకుపైగా ఖర్చయింది. ఇది మొత్తం పూర్తి బుల్లెట్ ప్రూఫ్ ఛాంబర్. ఇందులోఉ ఓ కాన్ఫరెన్స్ హాలు, కేబినెట్ సమావేశాలకు ఓ హాలు, విజిటర్ల లాంజి, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల ఛాంబర్లు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కోసం కూడా అదే బ్లాకులోని ఏడో అంతస్థులో మరో ఛాంబర్ నిర్మించారు.
కానీ, సచివాలయం విజయవాడకు తరలిపోయిన తర్వాత ఇవన్నీ వృథాయే అవుతాయి. మహా అయితే రెండు మూడేళ్లు మాత్రమే ఇక్కడ ఉంటామని, ఆ తర్వాత విజయవాడ నుంచే కార్యకలాపాలు సాగుతాయని కొంతమంది మంత్రులే చెబుతున్నారు. ఒకవైపు రుణమాఫీ లాంటి పథకాలకు డబ్బు లేదంటూనే తాత్కాలిక సరదాల కోసం ఇన్నేసి కోట్లు ఖర్చుపెట్టడం ఏంటోనని అంతా నోళ్లు నొక్కుకుంటున్నారు.