విడిగానే ఏపీ ఎంసెట్ | andhra pradesh decides to conduct EAMCET separately | Sakshi
Sakshi News home page

విడిగానే ఏపీ ఎంసెట్

Published Tue, Feb 3 2015 1:56 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

విడిగానే ఏపీ ఎంసెట్ - Sakshi

విడిగానే ఏపీ ఎంసెట్

 సీఎంతో మంత్రి గంటా చర్చల్లో నిర్ణయం
 విభజన చట్టాన్ని టీ-సర్కారు ఉల్లంఘిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
 లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాక.. విడిగా ఎంసెట్ నిర్వహణపై రేపు అధికారిక ప్రకటన
 షెడ్యూల్ ప్రకారమే ప్రవేశ పరీక్షల నిర్వహణ.. కాకినాడ జేఎన్‌టీయూకు ఎంసెట్ బాధ్యత

 
 సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్)ను తెలంగాణ రాష్ట్రంతో కలసి ఉమ్మడిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన చేయనుంది. తెలంగాణతో సంబంధం లేకుండా ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న కాలేజీలకు మాత్రమే ఎంసెట్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి ద్వారా నిర్వహించనున్నారు. ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో తలెత్తిన వివాదంపై సోమవారం రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సోమవారం భేటీ అయ్యారు. ఉమ్మడి ఎంసెట్‌కు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటూ ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేయడం, గవర్నర్ నరసింహన్ సూచనలనూ ఆ ప్రభుత్వం బేఖాతరు చేయడం తదితర అంశాలను వివరించారు. తెలంగాణ మొండిగా ఉన్నందున ఉమ్మడి ఎంసెట్ నిర్వహణపై ఇక ఎంతచేసినా ఫలితం ఉండదన్న అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ వైఖరిపై కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాక.. విడిగా ఎంసెట్ నిర్వహించటంపై అధికారిక ప్రకటన చేయాలని నిర్ణయించారు.
 
 కేంద్రానికి సవివరంగా ఫిర్యాదు చేయాలి
 
 ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్తంభింపచేసిన విషయాన్నీ మంత్రి గంటా సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. వీటన్నిటిపైనా చంద్రబాబు సావధానంగా చర్చించారు. ‘విభజన చట్టంలోని పదో షెడ్యూలులో ఉన్న విద్యా సంస్థలన్నీ పదేళ్ల పాటు ఉమ్మడిగా ఉండాలి. అయినా విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ఉమ్మడి ఎంసెట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ముందుగానే చర్చించి షెడ్యూల్‌ను విడుదల చేసినందున మనవైపు నుంచి ఎలాంటి తప్పూలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఉన్నత విద్యామండలిని ఏర్పాటుచే యడంతో పాటు వేరు షెడ్యూల్‌ను విడుదల చేడయం చట్టాన్ని అతిక్రమించడమే. గవర్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినందున తదుపరి కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా నివేదిక పంపించాలి. తెలంగాణ కలసిరాకపోవడం వల్లనే వేరు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందన్న విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేయాలి. బ్యాంకు ఖాతాల స్తంభన విషయాన్నీ కేంద్ర హోంశాఖకు, ఆర్థికశాఖకు ఫిర్యాదు చేయాలి’ అని చంద్రబాబు మంత్రిని ఆదేశించినట్లు తెలిసింది. ఆ తరువాత వేరు పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. తెలంగాణ తీరుపై కోర్టుకు వెళ్లడం వల్ల పరీక్షలు ఆలస్యమై విద్యార్థులకు నష్టం వస్తుంది కనుక కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు.
 
 పాత షెడ్యూల్‌లోనే ప్రవేశ పరీక్షలు...
 
 ఎంసెట్‌ను వేరుగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ అంశాన్ని ఏపీ ఉన్నత విద్యామండలి ద్వారా అధికారిక ప్రకటన చేయించనుంది. సీఎంతో సమావేశానంతరం మంత్రి గంటా ఉన్నత విద్యాశాఖాధికారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డిలతో మాట్లాడారు. బుధవారం విశాఖపట్నంలో మరోసారి సమావేశం నిర్వహించి ఎంసెట్‌తో సహా వివిధ ప్రవేశ పరీక్షలపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి వివిధ సెట్లకు షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారమే సెట్ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పదో తేదీన కొన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పరీక్షలున్నట్లు వార్తలు వచ్చినా అవి ప్రైవేటు సంస్థలకు సంబంధించినవి కనుక వాటితో తమ షెడ్యూల్‌కు సంబంధం లేదని వివరించారు. ప్రభుత్వాలు నిర్వహించే సెట్ల తేదీలన్నిటినీ సరిచూసుకున్నాకనే షెడ్యూల్‌ను రూపొందించినట్లు వివరించారు.
 
 జేఎన్‌టీయూ కాకినాడకు ఎంసెట్ బాధ్యత...
 
 ఎంసెట్ బాధ్యతను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (కాకినాడ)కు అప్పగించాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ నిర్వహించేది. ఇతర సెట్లను కూడా ఏపీలోని వేర్వేరు వర్సిటీలకు కేటాయించనున్నారు. కాకినాడ జేఎన్‌టీయూ నిర్వహిస్తున్న ఈసెట్‌ను వేరే వర్సిటీకి అప్పగించనున్నారు. ఎడ్‌సెట్‌ను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తున్నందున దానికే ఆ బాధ్యతలను కొనసాగించవచ్చని చెప్తున్నారు. లాసెట్‌ను శ్రీవెంకటేశ్వర వర్సిటీ, పీఈసెట్‌ను నాగార్జున వర్సిటీ నిర్వహిస్తున్నందున వాటికే ఆయా సెట్‌ల బాధ్యత కొనసాగించనున్నారని తెలుస్తోంది. ఐసెట్‌ను, పీజీఈసెట్‌ను ఏపీలోని వేరే యూనివర్సిటీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఐసెట్‌ను ఏయూకి కేటాయించవచ్చని తెలుస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement