ఏపీలో మే 10న ఎంసెట్
సాక్షి, విశాఖపట్నం: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కారు మాదిరిగా విడిగానే ఎంసెట్ నిర్వహించనుంది. మే 10న ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఎంసెట్ నిర్వహణ బాధ్యతనుకాకినాడ జేఎన్‌టీయూకి అప్పగించినట్లు తెలిపారు. ఎంసెట్‌తో పాటు మొత్తం ఏడు సెట్‌ల తేదీలను మంత్రి విడుదల చేశారు.
రాష్ట్రంలో 2 లక్షల 5 వేల మంది వరకు విద్యార్థులు ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. కన్వీనర్ కోటా కింద 1,16,738 సీట్లు ఉంటాయన్నారు. ఎంసెట్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ నిర్వహించనున్నట్లు తెలిపారు. నాన్ లోకల్ కోటా ఎప్పటిలాగానే 15 శాతంగా ఉంటుందని, షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేస్తుందన్నారు. భవిష్యత్‌లో ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్ల భర్తీని ఎంసెట్ ద్వారా చేయాలా, లేక తమిళనాడు మాదిరి ఇంటర్ మార్కుల ఆధారంగా చేయాలా అనే దానిపై ఆలోచిస్తామని తెలిపారు.
తెలంగాణ చట్టాన్ని ఉల్లంఘించింది
లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా చర్చలు జరిపినా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఎంసెట్‌కు ఒప్పుకోలేదన్నారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కూడా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాల్సి ఉన్నా అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రమని, వాటికన్ సిటీలా దానికి ప్రత్యేక పరిధులు లేవని ఆయన వ్యాఖ్యానించారు.
షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ
ఇంతకుముందు ప్రకటించిన తేదీల ప్రకారమే డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థులకు ఉండటం లేదని, ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలకు ఏ, బీ, సీ గ్రేడ్‌లు ఇచ్చేందుకు నిపుణుల కమిటీని నియమిస్తున్నామని తెలిపారు. సీ కేటగిరిలో ఉన్న కళాశాల పనితీరు మెరుగుపడకపోతే అనుమతులు రద్దు చేస్తామన్నారు.
గుర్తింపులేని, వేలకువేలు ఫీజులు తీసుకుంటూ సౌకర్యాలు కల్పించని పాఠశాలలను దశల వారీగా మూయిస్తామని చెప్పారు. ప్రాథమిక విద్యలో ప్రతిభావంతులైన నాలుగువేల మంది విద్యార్థులకు ఈ నెల 27న తిరుపతిలో ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కాకినాడ జేఎన్‌టీయూ, రాయలసీమ, శ్రీకృష్ణదేవరాయ, విక్రమ సింహపురి యూనివర్సిటీలకు త్వరలో రెగ్యులర్ వైస్ చాన్సలర్లను నియమిస్తామని చెప్పారు. దీనిపై సెర్చ్ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు.
తిరుపతి ఉప ఎన్నికల వల్ల చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో నిలిచిన ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లకు త్వరలో శంకుస్థాపన చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ఎంసెట్-2015ను విజయవంతంగా నిర్వహించి, ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని జేఎన్‌టీయూకే ఇన్‌చార్జి వీసీ ప్రభాకరరావు ‘సాక్షి’తో అన్నారు.
వివిధ సెట్‌ల : నిర్వహణ తేదీలు
ఎంసెట్ : మే 10
ఈసెట్ : మే 14
పీఈటీసెట్ : మే 14
ఐసెట్ : మే 16
పీజీసెట్ : మే 25
ఎడ్‌సెట్ : మే 28
లాసెట్ : మే 30