
ఏలూరులో సమీక్షిస్తున్న డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ చిత్రంలో డీఐజీ త్రివిక్రమవర్మ
ఏలూరు టౌన్: సార్వత్రిక ఎన్నికలను రాష్ట్రంలో అత్యంత సమర్థవంతంగా నిర్వహించామని, వచ్చేనెల 23న జరిగే కౌంటింగ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశిం చారు. ఏలూరులోని పోలీసు జిల్లా ప్రధాన కార్యాలయంలో ఏలూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమవర్మ, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌తో ఎన్నికల నిర్వహణ, పరిస్థితులపై శనివారం డీజీపీ ఠాకూర్ సమీక్షించారు. అదనపు ఎస్పీ ఈశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌తోపాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు ఈ సమీక్షకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌంటింగ్‌కు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆదేశించామన్నారు. కౌంటింగ్ అనంతరం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, శాంతిభద్రతల కు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల్లో చేపట్టిన చర్యలు, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశాలపై సమీక్షిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో నక్సల్స్ ప్రభావం ఎంతవరకు ఉంది, ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి తదితర అంశాలపై ఆరా తీశామన్నారు. జిల్లాలోని స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉన్నాయనే అంశంపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు.
రాష్ట్రంలోనూ ఉగ్రదాడులు జరుగుతాయనే విషయంపై తమిళనాడు డీజీతోనూ మాట్లాడామని, అయితే అక్క డ ఒక మాజీ మిలటరీ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ధ్రువీకరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అతి తక్కువ బలగా లతో ఎన్నికలను సజావుగా నిర్వహిం చామని, గతంతో పోల్చితే అతి తక్కువ కేసులు నమోదయ్యాయని, పటిష్ట భద్రత నడుమ పోలింగ్ చేపట్టామని డీజీపీ ఠాకూర్ వివరించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.