సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మద్యం నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం మధ్యం ధరలను 25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం ధరలు మొత్తం 75 శాతం పెరిగినట్టయింది. పెంచిన ధరలు నేటి(మంగళవారం) నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పెంచిన ధరలతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం షాపులు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం మార్గదర్శకాల మేరకు దాదాపు 45 రోజుల తర్వాత నిన్న మద్యం దుకాణాలకు అనుమతించడంతో.. నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యాపానాన్ని నిరుత్సాహరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. (చదవండి : పేదలకు దూరం చేయడానికే)
ఇందుకు సంబంధించి ఎక్సైస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. కొత్తగా పెంచిన 50 శాతం ధరలను నేటి నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. ఈరోజు ఒక గంట ఆలస్యంగా మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఉదయం 11 గంటలకు బదులుగా 12 గంటలకు ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment