గత సర్కార్లపై దుమ్మెత్తిపోయండి
*శ్వేతపత్రాల తయారీపై ఏపీ సీఎస్ సూచనలు
*కుదరదంటూ మండిపడిన సీనియర్ ఐఏఎస్‌లు
*శ్వేతపత్రాలంటే ఉన్న వాస్తవ పరిస్థితినే చెపుతాం
*గత నిర్ణయాలు లోపాలని ఎలా చెబుతాం?
*మీకు కావాల్సినట్లు తయారుచేయలేమని స్పష్టీకరణ
*ఇక్కడ చర్చ వద్దంటూ సీఎస్ అసహనం
హైదరాబాద్: శ్వేతపత్రాలపై ఆదిలోనే చిచ్చురేగింది. గత ప్రభుత్వాల్లో పాలన పట్టాలు తప్పిందన్నట్లుగా శ్వేతపత్రాలను రూపొందించాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యతిరేకించారు. శ్వేతపత్రాల్లో వాస్తవ పరిస్థితులను వివరిస్తామే తప్ప గత ప్రభుత్వాలపై ఆరోపణలు చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో వారిపై సీఎస్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ఆరు రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్వేతపత్రాలంటే ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించడం కాగా, అందుకు పూర్తి భిన్నంగా శ్వేత పత్రాలను రూపొందించాలని సీఎస్ కొన్ని సూచనలు చేశారు.
గత పది సంవత్సరాలుగా పాలన పట్టాలు తప్పిందనే అర్థంవచ్చేలా, గత ప్రభుత్వాల్లో ప్రధాన రంగాల్లో లోపాలు జరిగాయంటూ శ్వేతపత్రాలను రూపొందించాల్సిందిగా ఆదేశించారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్య రంగాల్లో లోపాలను ఎత్తి చూపుతూ శ్వేతపత్రాలను రూపొందించాలని సూచించారు. దీనిపై పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు జరిగాయని ఎలా తప్పుపడతామని ప్రశ్నించారు.
ఆరోగ్యశ్రీ అనేది గత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, దీనికి అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, దాని ప్రకారం అధికారులు అమలు చేశారని, ఇప్పుడు ఆ పథకంలో లోపాలున్నాయని, అ నిధులు వృథా అయ్యాయని ఏ విధంగా శ్వేతపత్రం రూపొందిస్తామంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రశ్నించారు. దీనిపై సీఎస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇక్కడ చర్చ వద్దంటూ గట్టిగా మాట్లాడారు.
సాగునీటి ప్రాజెక్టులకు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన వ్యయం వృథా అంటూ శ్వేతపత్రం రూపొందించాలని సీఎస్ సూచించారు. దీనిపై కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం మేరకే జరిగిందని, కాలువలు తవ్విన మాట వాస్తవమేనని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఇప్పుడు పెట్టిన ఖర్చుకు ఫలితం వస్తుందని సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి జాప్యం అవుతుందనే ఉద్దేశంతోనే తాడిపూడి, పుష్కరం ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తి చే యడంతో రైతులకు సాగునీరు అందుతోందని సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు. పోలవరం పూర్తయ్యాక తాడిపూడి, పుష్కరం వృథా అవుతాయి కదా అంటే ఎలాగని, గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల మేరకే ఆ నిర్మాణాలు సాగాయని అధికారులు వివరించారు.
ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ కాగ్ నివేదికలను ఇచ్చింది కదా ఆ నివేదికలనే కొత్త ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని, ఇక కొత్తగా శ్వేతపత్రాలు ఎందుకంటూ మరో సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. మొత్తంమీద సీనియర్ ఐఏఎస్‌లందరూ సీఎస్ సూచనలపట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ... ఏ రంగానికి ఎంత వ్యయం చేశాం, దానివల్ల ఎంత మేర పని అయిందనే వివరాలతో వాస్తవ పరిస్థితిని శ్వేతపత్రాల్లో వివరిస్తాం తప్ప మీకు కావాల్సినట్లు తయారు చేయలేమని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం.