గవర్నర్ సీరియస్
* ఏపీ మంత్రుల అభ్యంతరకర దూషణలపై నరసింహన్ ఆగ్రహం
* కేంద్రం కన్నెర్ర.. చిక్కుల్లో ఏపీ సీఎం చంద్రబాబు
* రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు మాట్లాడే భాషేనా..
* ఏపీ సీఎంకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా?
* ఇలాంటి ధోరణి ఎక్కడా చూడలేదంటూ గవర్నర్ మండిపాటు
* అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై కేంద్రం కూడా ఆరా
* గవర్నర్‌తో మాట్లాడి వివరాలు సేకరించిన హోం శాఖ కార్యదర్శి
* ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై క్లిప్పింగ్‌లను కేంద్రానికి పంపిన గవర్నర్
* ఏపీ సీఎస్ కృష్ణారావుకు గోయల్ మందలింపు
* వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మంత్రులకు బాబు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా పరిగణించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. గవర్నర్‌ను కించపరిచే విధంగా మంత్రులు, పార్టీ నేతల ద్వారా అడ్డగోలుగా మాట్లాడిస్తున్న తీరుపై మండిపడింది. ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికలు జారీ అయ్యాయి. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ విషయంలో రాజకీయం చేయాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో అసలు విషయాలను పక్కదారి పట్టించడం కోసం.. కొత్త వివాదాలు తెరమీదకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు అసలుకే మోసం తెచ్చేలా మారాయి. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆరోపణలతో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబును తాజా పరిణామాలు మరింత చిక్కుల్లో పడేశాయి.
ఢిల్లీలోనే ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును పిలిచి తాజా పరిణామాలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో పాటు తాజాగా గవర్నర్‌పై ఏపీ మంత్రులు, అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మొత్తం వివరాలను కేంద్ర హోం శాఖ తెప్పించుకుని పరిశీలించింది. శాఖ కార్యదర్శి ఎల్‌సీ గోయల్ రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో ఫోన్‌లో మాట్లాడి జరుగుతున్న పరిణామాలేంటో అడిగి తెలుసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలేవైనా ఉంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే ఏపీ మంత్రులు, ఆ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్న తీరును గవర్నర్ వివరించినట్టు తెలిసింది. అంతకుముందు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు తదితరులతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ నేతలు అభ్యంతరకరమైన పదజాలంతో విమర్శలు చేయడాన్ని గవర్నర్ తీవ్రంగా పరిగణించారు.
రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారు రాజ్యాంగ బద్ధమైన గవర్నర్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడ్డారు. వీరి తీరు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ‘ఇవన్నీ ఏపీ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతున్నాయా? చంద్రబాబుకు తెలియకుండానే మంత్రులు అడ్డగోలు భాషను ప్రయోగిస్తున్నారా?’ అంటూ ఆయన ఆగ్రహం ప్రదర్శించారు. ‘గవర్నర్ స్థానంలో ఎవరున్నా రాజ్యాంగ బద్ధంగా పనిచేస్తుంటారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఎవరు ఏ సమస్య చెప్పాలనుకున్నా వెంటనే అపాయింట్‌మెంట్ ఇస్తున్నాను. ఇప్పటికి చాలామంది నేతలొచ్చి కలిశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు అనేకసార్లు కలిశారు. ప్రతి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. రాష్ట్రంలో ఏవైనా సంఘటనలు జరిగితే కేంద్రానికి నివేదించడానికి కేంద్రం ఆధ్వర్యంలో అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గవర్నర్‌పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తారా? ఇలాంటి ధోరణులను ఎక్కడా చూడలేదు..’ అంటూ మండిపడ్డారని తెలిసింది.
ఓటుకు కోట్లు వ్యవహారంలో కేంద్రానికి గవర్నర్ నివేదిక ఒక్కటే అవసరం కాదు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)తో సహా అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఆ సంస్థలు ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తుంటాయి. అలాంటివి పట్టించుకోకుండా ఒక రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌ను కించపరిచే విధంగా మంత్రులు మాట్లాడటాన్ని కేంద్రం సైతం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఓటుకు కోట్లు వ్యవహారంతో పాటు గవర్నర్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్న విషయాలు జాతీయ మీడియాలో రావడంతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్ స్వయంగా గురువారం సాయంత్రం గవర్నర్‌కు ఫోన్ చేసి వివరాలను అడిగారు. గవర్నర్ మొత్తం వ్యవహారాన్ని విడమరిచి చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులు, టీవీల్లో ప్రసారమైన వీడియో టేపులను ఆయన కేంద్ర హోం శాఖకు పంపించారు.
వివరణలోనూ అచ్చెన్నాయుడు తిరకాసు
బుధవారం విలేకరుల సమావేశంలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గవర్నర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే పరిస్థితి చేయి దాటడంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అందులో ఎక్కడా గవర్నర్ అన్న మాట ప్రస్తావించకుండా మీడియాకు వివరణ పత్రం పంపించారు. అందులో ‘‘నిన్న నేను విలేకరుల సమావేశంలో గంగిరెద్దు అన్న మాట ఆయన మీద ద్వేషంతో అన్న మాట కాదు. మా రాష్ట్రం ఈరోజు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆవేదనలో వచ్చిన మాట. కావాలని అన్న మాట కాదు. దీనిని ఎవరూ అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనసును గాయపరిస్తే నేను ఆ మాటను ఉపసంహరించుకున్నాను’’ అని పేర్కొన్నారు.
పక్కదారి పట్టించబోయి..!
ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణల ఆడియో టేపులు బయటకు పొక్కిన రోజు నుంచి చంద్రబాబు దానిని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదంగా మార్చే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా విభజన చట్టంలోని సెక్షన్ 8, శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఉండటం, ఉద్యోగుల పంపిణీ, ఫోన్ ట్యాపింగ్ వంటి విషయాలను తెరమీదకు తెచ్చారు. స్టీఫెన్‌సన్‌తో జరిగిన సంభాషణపై వివరణ ఇవ్వకుండా గడచిన 20 రోజులుగా ఇలాంటి అంశాలను తెరమీదకు తెస్తూ వివాదం చేయడానికి ప్రయత్నించారు. చివరకు గవర్నర్‌ను వివాదంలోకి లాగాలన్న ప్రయత్నంలో ఆయనపై వ్యక్తిగత దూషణలు మొదలుపెట్టినట్టు జరిగిన సంఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు తలెత్తిన సమయంలో ఏ నాయకుడొచ్చి కలుసుకున్నా అపాయింట్‌మెంట్ ఇచ్చి వారు చెప్పిన వివరాలను నరసింహన్ తెలుసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి సామరస్య పరిష్కారానికి ప్రయత్నించారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఓటుకు కోట్లు విషయంలో ఆయన కేంద్రానికి వాస్తవ నివేదిక ఇచ్చారన్న అనుమానాలతో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కాదని ఆయన సలహాదారులను చంద్రబాబు తన ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అధికార తెలుగుదేశం గవర్నర్ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ విషయాలను గవర్నర్‌తో పాటు కేంద్రం తీవ్రంగా పరిగణించడంతో కథ అడ్డం తిరిగినట్టయింది.
మరిన్ని చిక్కుల్లో..
చంద్రబాబు తన వ్యక్తిగత సమస్యలు ప్రజా సమస్యలుగా మలచడానికి చేసిన ప్రయత్నాలు తాజా ఘటనలతో బెడిసికొట్టినట్టయింది. పైగా ఆయన్ను మరింత చిక్కుల్లో పడేశాయి. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గురువారం ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును తీవ్రస్థాయిలో మందలించినట్టు తెలిసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలకు కూడా దారితీయొచ్చని హెచ్చరించినట్టు తెలిసింది. ఆయన హడావుడిగా విజయవాడలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జరిగిన విషయాలను వివరించారు. దీంతో బిత్తరపోయిన చంద్రబాబు హుటాహుటిన మంత్రులకు ఫోన్లు చేసి గవర్నర్ విషయంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టుగా వివరణలు పంపించాలని ఆదేశించారు.
గవర్నర్‌ను క్షమాపణలు కోరాలని చెప్పినట్టు తెలిసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం రాత్రి పత్రికా కార్యాలయాలకు వివరణ పంపించారు. ‘ఆయన మనసును గాయపరిస్తే నేను ఆ మాటను ఉపసంహరించుకుంటున్నాను..’ అని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. అలాగే గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన రామ్‌లాల్, ఎన్డీ తివారీలకు పట్టిన గతే నరసింహన్‌కు పడుతుందంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలతో పాటు ఆ సందర్భంగా అన్న అన్ని మాటలను ఉపసంహరించుకుంటున్నట్టుగా ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు సందేశం పంపించారు.