సాక్షి, గుంటూరు : జిల్లాలోని సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం ట్విటర్ వేదికగా స్పందించింది. పట్టణంలోని టింబర్ డిపో నిర్వాహకుడు షేక్ మహ్మద్ గౌస్(35) సోమవారం ఉదయం మందులు కొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్ పోస్టు వద్ద ఎస్‌ఐ రమేశ్ ఆపి సాధరాణ విధుల్లో భాగంగా తనిఖీ చేసారు. అప్పటికే పోలీసులు కొడతారనే భయంతో ఉన్న, హృద్రోగి కూడా అయిన గౌస్ పడిపోవడంతో తండ్రి షేక్ మహ్మద్ ఆదం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గౌస్ మృతి చెందారు. దీనిపై మంగళవారం ట్విటర్ ఏపీ పోలీసులు వివరణ ఇచ్చారు. (సత్తెనపల్లిలో యువకుడి మృతి)
‘గుంటూరు రూరల్ జిల్లాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో షేక్ మహ్మద్ గౌస్ మరణించారు. ఈ సంఘటనలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. చెక్ పోస్ట్ వద్ద మృతుడిని ఆపిన సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ సస్పెండ్ చేశాం. మరణించిన వ్యక్తి బాల్యం నుండి పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపదుతున్నారు. ఆపరేషన్ చేసి స్టెంట్లు అమర్చారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పంచనామాలో గుర్తించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డీజీపీ డిపార్ట్‌మెంటల్ విచారణకు కూడా ఆదేశించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని విధానాలు పాటిస్తున్నాము’ అని ట్విటర్‌లో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment