హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది, క్రిమినల్ కేసుల వాదనలో దక్షిణభారతదేశంలోనే దిట్టగా పేరొందిన సి.పద్మనాభరెడ్డి(82) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. పద్మనాభరెడ్డి స్వగ్రామం అనంతపురం జిల్లా యాడికి. ఆయనకు భార్య ఇందిరమ్మ, కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. పద్మనాభరెడ్డి సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చిన్నపరెడ్డికి తోడల్లుడు. గ్యాస్ట్రిక్ సమస్యతో పద్మనాభరెడ్డి పది రోజులుగా సోమాజిగూడలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వైద్యులు అత్యవసర వైద్యం ప్రారంభించారు. అయితే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో గుండెపోటు రావడంతో పద్మనాభరెడ్డి తుదిశ్వాస విడిచా రు. ఈ సమాచారంతో రాష్ట్రంలోని న్యాయవాదులంతా దిగ్భ్రాంతి కి గురయ్యారు.
పద్మనాభరెడ్డి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ రోడ్డు నం.10సీలోనున్న ఆయన స్వగృహానికి తరలించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ నౌషద్ అలీ, జస్టిస్ రోహిణి, సాక్షి మీడియా గ్రూపు చైర్‌పర్సన్ వైఎస్ భారతి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు కె.నారాయణ, బీవీ రాఘవులు, పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రముఖులు పద్మనాభరెడ్డికి నివాళులర్పించారు. న్యాయవాద వృత్తిలో విశేషమైన రాణింపుతో ఓ గురువులా బాసిల్లిన పద్మనాభరెడ్డికి నివాళులర్పించేందుకు న్యాయమూర్తులు, భారీ సంఖ్యలో న్యాయవాదులు ఆయన నివాసానికి వచ్చారు. పద్మనాభరెడ్డి అంత్యక్రియలు సోమవారం ఉదయం ఎర్రగడ్డలోని హిందూ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
వృత్తిలో ఓ శిఖరం...
పద్మనాభరెడ్డి 1931, మార్చి 18న అనంతపురం జిల్లా యాడికిలో ఓబుల్‌రెడ్డి, సోమక్క దంపతులకు జన్మించారు. ఓబుల్‌రెడ్డి కడప జిల్లా చామలూరు నుంచి యాడికి వచ్చి స్థిరపడ్డారు. యాడికి, తాడిపత్రిలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన పద్మనాభరెడ్డి ఇంటర్మీడియెట్ గుంటూరులో, డిగ్రీ అనంతపురంలో చదివారు. మద్రాస్‌లో న్యాయవిద్యను అభ్యసించిన ఆయన మద్రాస్ హైకోర్టులోనే 1953 జూలై 27న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. అక్కడ వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆంధ్ర రాష్ట్రం అవతరణలో గుంటూరులో ఏర్పాటైన హైకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. తరువాత 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణతో హైకోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటు కావడంతో పద్మనాభరెడ్డి కూడా ఇక్కడే న్యాయవాదిగా సేవలందించారు. తనకు సమీప బంధువైన ప్రముఖ న్యాయకోవిదులు, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఈ ప్రస్థానంలో ఎన్నో క్రిమినల్ కేసుల్లో వాదనలు వినిపించారు. హైకోర్టుకొచ్చే ఈ కేసుల్లో దాదాపు సగం వరకు ఆయనే హాజరయ్యేవారంటే అతిశయోక్తి కాదు. సంచలన పార్వతీపురం కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసులు తప్పుడువని నిరూపించి నిందితులను నిర్దోషులుగా విడిపించిన ఘనత ఆయనదే.
పద్మనాభరెడ్డికి ప్రముఖుల నివాళి
‘‘ న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కల్గించిన వ్యక్తుల్లో పద్మనాభరెడ్డి ఒకరు. ఏ కేసైనా వాదనల్లో ఆయనకు ఆయనే సాటి. ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పే ఆయనంటే న్యాయవాదులకే కాదు న్యాయమూర్తులకూ ప్రత్యేక గౌరవం. కేసులో నిందితుడు పేదవాడా, ధనికుడా అనేది కాకుండా న్యాయాన్ని గెలవాలనే తపనతోనే వాదనలు వినిపించేవారు.’’
- జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి
‘‘దాదాపు ఆరు దశాబ్దాల వృత్తి జీవితంలో పద్మనాభరెడ్డి తన గొప్పతనాన్ని రుజువు చేసుకొన్న సందర్భాలెన్నో ఉన్నాయి. వృత్తి పట్ల నిబద్ధతే ఆయన్ను అగ్రస్థానంలో నిలబెట్టింది. అంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా సాధారణ వ్యక్తిలా మసలుకోవడం ఆయనకే సాధ్యమైంది. విలువలకు ప్రాముఖ్యతనిచ్చిన గొప్ప మానవతావాది.’’
- జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి
‘‘పద్మనాభరెడ్డి మరణం న్యాయవ్యవస్థకు, రాష్ట్ర హైకోర్టుకు తీరని లోటు. న్యాయవ్యవస్థకు ఆయన సేవలు అజరామరం. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా తనను ఆశ్రయించిన క్షక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి తపనపడటం ఆయనకే చెల్లింది.’’
- జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి
‘‘క్రిమినల్ కేసుల వాదనలో అపారమైన అనుభవమున్న ప్రముఖ న్యాయవాదే అయినా పద్మనాభరెడ్డిలో ఎప్పుడూ ఆ గర్వం కనిపించేదికాదు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చినవారికి ఆయనో మార్గదర్శి. వారి సందేహాలు నివృత్తి చేయడమే కాదు ఏ సహాయం అడిగినా కాదనేవారు కాదు.’’
-సీవీ మోహన్‌రెడ్డి, మాజీ అడ్వొకేట్ జనరల్
‘‘పౌర, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ జీవన్‌రెడ్డి, పత్తిపాటి వెంకటేశ్వర్లు, పద్మనాభరెడ్డితో కలిసి పనిచేశా. హక్కుల ఉద్యమకారులపై పెట్టిన కేసుల్లో పద్మనాభరెడ్డి వారికి అండగా నిలిచేవారు. ఆయన మరణం అట్టడుగు వర్గాలకు తీరని లోటు.’’
- బొజ్జా తారకం, హైకోర్టు సీనియర్ న్యాయవాది
‘‘అత్యంత వివాదాస్పదమైన, క్లిష్టమైన కేసుల్లో తలెత్తే ఎన్నో సందేహాలను పద్మనాభరెడ్డి న్యాయవాదులకు నివృత్తి చేసేవారు. అయినా ఆయన ఏ న్యాయవాదినీ చిన్నచూపు చూసిన సందర్భం ఒక్కటీ లేదు. అదీ ఆయన గొప్పదనం.’’
- సి.నాగేశ్వర్‌రావు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు
‘‘పద్మనాభరెడ్డి ప్రజాస్వామ్య ఉద్యమాలకు పునాదిగా ఉన్నారు. పేదలకు ఉచిత న్యాయసహాయం అందించడమేకాక వారికి మనోధైర్యాన్ని ఇచ్చేవారు. సహాయం కోసం ఎవ్వరు, ఏ సమయంలో వచ్చినా అండగా నిలిచేవారు.’’
- సావిత్రి, పద్మనాభరెడ్డి జూనియర్ లాయర్