మీ అభిమానమే నడిపించింది | People support has given strength to Sharmila for finish Maro Prajaprastanam | Sakshi
Sakshi News home page

మీ అభిమానమే నడిపించింది

Published Mon, Aug 5 2013 3:23 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

మీ అభిమానమే నడిపించింది - Sakshi

మీ అభిమానమే నడిపించింది

 ‘‘వైఎస్... ఈ పదం రాష్ట్ర గతిని మార్చింది.. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పింది.. రైతులను సగర్వంగా నిలబెట్టగలిగింది..’’ అని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభలో ఆమె మాట్లాడారు. ఇచ్ఛాపురానికి రాగానే తన మనసు వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటోం దంటూ ఉద్వేగానికి గురయ్యారు. వైఎస్ మరణం తర్వాత తన కుటుంబంపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలను తలచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
 
 మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా..
 ‘‘ఇచ్ఛాపురంలోకి ప్రవేశించినప్పటి నుంచి నా మనసు పదేపదే వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటోంది. ఆయన పాదయాత్ర అనుభూతులను గుర్తుకు తెచ్చుకుంటోంది. పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై అధికారంలోకి రాగానే దృష్టి సారించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపారు. ఇడుపులపాయలో చెప్పాను.. వైఎస్సార్ మన మధ్య లేరు. ఉన్న ఇద్దరు బిడ్డల్లో ఈ కాంగ్రెస్ పాలకులు చేస్తున్న అన్యాయాలకు, అక్రమాలకు ఒక బిడ్డ అన్యాయంగా జైల్లో ఉన్నాడు. ఇంకో బిడ్డ రోడ్డు మీదకు వస్తోంది.. ఆ బిడ్డను ఆదరించి, అక్కున చేర్చుకోవాలని అడిగాను. మీ మనవరాలిగా, మీ కూతురిగా, మీ చెల్లిగా ఈ బిడ్డను ఆదరించమని చెప్పి మీ చేతుల్లో పెట్టాను. ఈ మరో ప్రజాప్రస్థానంలో మీరు చూపిన ఆదరాభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అపురూపంగా పెరిగిన బిడ్డ ఎండలో నడుస్తుంటే చూశాను. వానలో నడుస్తుంటే చూశాను. చలి పెట్టినప్పుడు ఆలోచించాను. టెంట్లోకి పాములు, తేళ్లు వచ్చాయని చెప్పినప్పుడు, ఆమెకు గాయాలు అయ్యాయని చెప్పినప్పుడు, ఆ గాయాలను రాజకీయం చేసినపుడు నా మనసుకు చాలా బాధనిపించింది. మీ ప్రేమ, అభిమానం ఆ బిడ్డను ముందుకు తీసుకువెళ్తుందనే నమ్మకంతోనే పాదయాత్రకు పంపించడం జరిగింది. మా కష్టాలను మీ కష్టాలుగా భావించి షర్మిలమ్మతో కలిసి అడుగు వేసిన ప్రతి ఒక్కరికీ, ఆదరించిన ప్రజలందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. షర్మిల మీద మీరు చూపిన అభిమానికి చేతులెత్తి మొక్కుతున్నా.
 
 ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని బయల్దేరారు..
 వైఎస్సార్ ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు మండుటెండలు. ఆరోజు నేను ఆయనకు ఒక మాట చెప్పాను ‘ఇంత ఎండలున్నాయి, కొంచెం ఎండలు తగ్గిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో’ అని చెప్పాను. ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పారు. ‘ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.. కష్టాల్లో ఉన్నారు. చంద్రబాబు పరిపాలన చీకటి పాలన. రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఓదార్చాల్సిన అవసరం ఉంది’ అని చెప్పి ఆరోజు ప్రజాప్రస్థానానికి బయలుదేరారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఆనాడు చంద్రబాబు పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో... ఈరోజు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో ప్రజలు అలాంటి కష్టాలే పడుతున్నారు. మళ్లీ మరో ప్రజాప్రస్థానం పేరుతో ప్రజల్లోకి వచ్చి వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని ఆరోజు జగన్ భావించారు.
 
 అక్టోబర్ 5న బెయిల్ వస్తే పాదయాత్ర చేయాలని రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నాడు. కానీ విధిలేని పరిస్థితుల్లో రాలేకపోయాడు. ఆయన స్థానంలో షర్మిలమ్మ ఈ మరో ప్రజాప్రస్థానం చేయడం జరిగింది. కొంత మంది ఇది ప్రపంచ రికార్డు అని చెప్తున్నారు. ఇది రికార్డుల కోసం చేసిన పాదయాత్ర కాదు. జగన్‌ను అక్రమంగా 15 నెలలుగా జైల్లో నిర్బంధించినందుకు, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఈ పాదయాత్ర కొనసాగింది.
 
 చర్చ లేకుండా విభజన తప్పు..
 తెలంగాణ అంశంపై మొదటిసారి చర్చలు జరిగినప్పుడు, శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు అప్పటికి ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు. షిండే ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్షంలో మాత్రమే వైఎస్సార్‌సీపీ పాల్గొంది. వైఎస్సార్ అనుకున్నట్టుగా అభివృద్ధి జరిగి ఉంటే ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు. విభజనకు ముందు మిత్రపక్షాలతో మాట్లాడినట్టుగానే  పార్టీలను పిలిచి ఇదిగో ఇలా చేస్తాం.. అని చెప్పి చేస్తే బాగుండేది. ఎలాంటి చర్చలు లేకుండా అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజిస్తామనడం చాలా తప్పు. సాగునీరు ఎలా కేటాయిస్తారు? కరెంటు ఎలా ఇస్తారు? హైదరాబాద్ ఉమ్మడి రాజ దాని అని చెప్పి ప్రజల్లో చిచ్చులు పెడుతున్నారు. ఒకరోజు గుంటూరు అంటారు, మరోరోజు ఒంగోలు అంటున్నారు. వీటన్నిటికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది’’
 
 ముందు ఒక మహిళ మూడు వేలకు పైగా కిలోమీటర్లు నడిచే సాహసం చేయడానికి సిద్ధపడటం చాలా గొప్ప విషయం. మండే ఎండల్లో సైతం చెదరని చిరునవ్వులతో ఆమె ప్రజలతో మమేకమైన తీరు అద్భుతం. అది ప్రజల మీద నిజమైన ప్రేమ ఉన్న వాళ్లకే సాధ్యపడుతుంది. యాత్రలో అడుగడుగునా తనను కలిసిన వికలాంగులను, వృద్ధులను, వ్యాధి పీడితులను ఆమె ప్రేమగా గుండెలకు హత్తుకొన్నారు. ‘భయపడొద్దు.. జగనన్న ఉన్నాడు’ అనే నమ్మకాన్ని, భరోసాను కలిగించారు. కష్టాలు ఎన్ని ఉన్నా, జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉన్నా వైఎస్సార్ కుటుంబం తమకు అండగానే నిలబడుతుందనే నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వగలిగారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ నిరాకరించిన తరువాత కార్యకర్తలు కొంత నిరాశకు లోనయ్యారు.. వారిలో షర్మిల పాదయాత్ర కొత్త ఆశలు నింపింది. రాజకీయాలకు అతీతంగా అందరు కూడా షర్మిలను అభినందిస్తున్నారు.’’
 - వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి
 
 
 ఒక మహిళ ఇన్ని వేల కిలోమీటర్లు నడవడం చరిత్రాత్మకం. జగనన్న వదిలిన బాణం గురి చూసి గమ్యాన్ని చేరింది. పీడిత, తాడిత ప్రజలకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్సార్ 35 ఏళ్లు కష్టపడితే.. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆయన కుటుంబానికీ తీరని ద్రోహం చేసింది. ముఖానికి నాలుగు రంగులు పూసుకున్న చిరంజీవికి.. సోనియాగాంధీ అడగగానే అపాయింట్‌మెంటు ఇచ్చారు. కానీ విజయమ్మ నెల రోజులు ప్రయత్నించినా అపాయింట్‌మెంటు ఇవ్వలేదు. అన్ని ప్రాంతాల్లో ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న తీరు చూసి వైఎస్సార్ జలయజ్ఞం పథకం తెచ్చారు. దీంతో ప్రజలు వైఎస్సార్‌ను మరో కాటన్‌దొరగా చూశారు. ఈ ప్రభుత్వం చేతగాక జలయజ్ఞం పథకానికి తూట్లు పొడుస్తోంది. అన్ని సంక్షేమ పథకాలు మళ్లీ అమలుకావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందే.’’
     - ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), మంగళగిరి, గుంటూరు జిల్లా
 
 విభజనకు నిరసనగా రాజీనామా చేస్తా..
 రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు న్యాయం చేయాలి. కానీ ఉన్న పళంగా విభజించడం బాధగా ఉంది. అందుకే రేపే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా. గతేడాది అక్టోబర్‌లో మొదలుపెట్టి విజయవంతంగా ముగిసిన షర్మిల పాదయాత్ర దేశచరిత్రలో నిలిచిపోతుంది. వైఎస్ చనిపోయిన తరువాత ఆయన ఆశయాలను నెరవేర్చడానికి  జగన్ రాజకీయాల్లోకి వచ్చారు.  ఆయనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కేసులు పెట్టారు. 14 నెలల నుంచి జైల్లో ఉంచారు. కాంగ్రెస్ కుట్రలను జనమే భగ్నం చేస్తారు.
     - మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ
 
 ఇటలీ రాణికి బుద్ధి చెప్పాలి
 వైఎస్ స్ఫూర్తితో షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రపంచ ప్రజాప్రస్థాన పాదయాత్ర అనాలి. 230 రోజుల అలుపెరుగని యాత్రలో వివిధ వర్గాల ప్రజల పట్ల షర్మిల చూపిన అభిమానం, ఆప్యాయత అద్భుతం. రాష్ట్రాలను ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని ఇందిర, రాజీవ్‌లు కోరుకున్నారు. కానీ వారి ఆశయాలకు భిన్నంగా ఇటలీ కోడలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడగొట్టింది. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ నుంచి నాయకులు వైదొలగాలి. ఇటలీ రాణికి ప్రజలు బుద్ధిచెప్పాలి.    - ధర్మాన కృష్ణదాస్, నరసన్నపేట ఎమ్మెల్యే
 
 చంద్రబాబుది పాతాళ యాత్ర..
 పేదలకు భరోసా, ధైర్యం చెప్పడానికి షర్మిల పాదయాత్ర చేశారు. కానీ చంద్రబాబు చేసింది పాదయాత్ర కాదు. అది పాతాళ యాత్ర. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ కుటుంబం పాటుపడుతోంది. జగన్ జైల్లో ఉన్నా పేదలకు సాంత్వన చేకూర్చే ప్రక్రియ ఆగకూడదనే తన కుటుంబాన్ని జనంలోకి పంపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో మూలనపడిన సంక్షేమ పథకాలు తిరిగి తెచ్చుకుందాం. అందుకోసం వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి. రాష్ట్రాన్ని చీల్చిన సోనియా అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.
     - గొల్ల బాబురావు, పాయకరావుపేట ఎమ్మెల్యే
 
 సమస్యలను జగన్ తీరుస్తారు
 రాజశేఖరరెడ్డి పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను సీఎం అయ్యాక పరిష్కరించారు. ఇప్పుడు షర్మిల తన యాత్రలో ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను రాసుకున్నారు. జగన్ సీఎం అయ్యాక వాటిని తీరుస్తారు. ఆనాడు నిర్వీర్యమైన కాంగ్రెస్ పార్టీని రాజశేఖరరెడ్డి కాపాడితే.. ఆయన రెక్కల కష్టంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐతో ఆయన కుటుంబాన్నే వేధిస్తోంది.
     - కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే
 
 ఇది చారిత్రక సందర్భం..
 షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం చారిత్రక సందర్భం. వైఎస్సార్ పాదయాత్ర ముగించిన పదేళ్ల తర్వాత షర్మిలమ్మ పాదయాత్ర చేపట్టి ఇచ్ఛాపురంలోనే ముగించడం కాకతాళీయం కాదు. అది చారిత్రక సందర్భం. సాహసంతో ఆమె చేసిన పాదయాత్ర ప్రతి గుండెను తట్టింది. సోనియా గాంధీ రాష్ట్రాన్ని కేకులా కోస్తే, చంద్రబాబు చాకుగా మారాడు. విభజించి పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చారు.
     - భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్యెల్యే
 
 ఎక్కడా చదవని చరిత్ర ఇది..
 ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ కనపడని, చదవని చరిత్ర మరో ప్రజాప్రస్థానం. మహానేత వైఎస్సార్ మృతితో రాష్ట్రం గందరగోళంగా మారితే ప్రజలకు అండగా ఉండటానికి ఆ మహానేత కుటుంబం మేమున్నామని ముందుకొచ్చింది. సీబీఐని అడ్డం పెట్టుకుని జగన్‌ను జైల్లో పెడితే వైఎస్సార్ పార్టీ ఆగిపోతుందని భావించారు. అది జరుగదని ప్రజలు నిరూపించారు. రాష్ట్ర విభజన చారిత్రక తప్పిదం.
 - జూపూడి ప్రభాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement