అంగన్‌వాడీలపై బాబు సర్కారు మరోమారు కన్నెర్ర చేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 14 మంది అంగన్‌వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం సభలో ప్లకార్డులు చూపినందుకు వారిని ఏకంగా విధుల నుంచి తొలగించారు.
నెల్లూరు (అర్బన్): అంగన్‌వాడీలపై బాబు సర్కారు మరోమారు కన్నెర్ర చేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 14 మంది అంగన్‌వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం సభలో ప్లకార్డులు చూపినందుకు వారిని ఏకంగా విధుల నుంచి తొలగించారు. వివరాలు.. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులో మహిళా దినోత్సవం సభ నిర్వహించారు. దీనికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఆ రోజు సభ ముగిసే సమయంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్లకార్డులు ప్రదర్శించారు. అది బాబు ఆగ్రహానికి కారణమై వారిని అప్పుడే తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
బాబు అన్నట్లే చేశారు..:సభలో ఇలా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు వారి పట్ల నియంతలా వ్యవహరించారు. సమస్యల పరిష్కారం కోసం ప్లకార్డులు పట్టుకున్న 14 మంది అంగన్‌వాడీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు సోమవారం ఐసీడీఎస్ పీడీ విద్యావతి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అధికారులు ఇలా చేసినట్లు సమాచారం.
మహిళలకు బాబు ఇచ్చే గౌరవం ఇదేనా?
తరచు మహిళల గౌరవం గురించి మాట్లాడే బాబు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఉద్యోగాలు కోల్పోయిన అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శేషమ్మ, స్వరూపారాణిలు ‘సాక్షి’తో మాట్లాడారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు.