ఉద్రిక్తం | anganvadi problems | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తం

Published Sat, Nov 28 2015 1:56 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

anganvadi problems

గుంటూరు వెస్ట్ : అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  పెరిగిన జీతాల జీఓ విడుదల చేయాలని, ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్, ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ఐదు రోజులుగా కలెక్టరేట్ వద్ద నిరవధిక దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వందల మంది తరలివచ్చారు. సీఎం చంద్రబాబు తమ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈక్రమంలో కలెక్టరేట్‌లోకి దూసుకుపోయేందు కు అంగన్‌వాడీలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది పోలీసులు అంగన్‌వాడీలను అసభ్యపదజాలంతో దూషించారు.

దీంతో ఆగ్రహించిన అంగన్‌వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, నాయకులు నళినీకాంత్, కాపు శ్రీనివాస్, బైరగాని శ్రీనివాస్, బి.లక్ష్మణరావు తదితరులను ఈడ్చుకుంటూ నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీనిని నిరసిస్తూ నాయకులను విడుదల చేయాలంటూ అంగన్‌వాడీలు, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు భగవాన్‌దాస్, సీఐటీయూ నాయకులు దండా లక్ష్మీనారాయణ, భాగ్యరాజ్‌లు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి రెచ్చిపోయిన పోలీసులు ఆందోళనకు దిగినవారిని ఈడ్చుకుంటూ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

ఈ సంఘటనల్లో వేమూరు మండలానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు పద్మావతి, బసవమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. బసవమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. దీన్ని నిరసిస్తూ అరెస్టయిన సీపీఎం, సీఐటీయూ నాయకులు పోలీసుస్టేషన్‌లోనే తమ నిరసనను కొనసాగించారు. అనంతరం పోలీసు స్టేషన్ నుంచి నాయకులు విడుదలయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆందోళన మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది.   పోలీసులను అడ్డు పెట్టుకుని ఉద్యమాలను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని నాయకులు హెచ్చరించారు.
 
జేసీ -2 హామీతో ఆందోళన విరమణ
అంగన్‌వాడీల ఆందోళనపై స్పందించిన జాయింట్ కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వరరావు, డీఆర్‌ఓ కె.నాగబాబు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డెరైక్టర్ ఎం.జె.నిర్మల తదితరులు వారితో చర్చించారు. అంగన్‌వాడీల సమస్యలను నాయకులు పాశం రామారావు, ధనలక్ష్మి, ఆర్.జ్యోతిరాణి, మెటిల్లాదేవి, వై.నేతాజీ, కాపు శ్రీనివాస్ తదితరులు జేసీకి వివరించారు. ఆయన స్పందిస్తూ అంగ న్‌వాడీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని  హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement