అంగన్‌వాడీల తొలగింపు ఉత్తర్వుల కాపీలు దహనం
లాఠీలతో ఉద్యమాలను అణచలేరు!
వైఎస్సార్‌సీపీ రాష్ర్ట కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
పట్నంబజారు (గుంటూరు) : లాఠీలు, తూటాలతో ఉద్యమాలను అణచలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీల తొలగింపునకు బాబు సర్కార్ ఉత్తర్వులు జారీచేయడం ఆయన నియంత వైఖరిని తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల తొలగింపునకు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం నగర కమిటీ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం జారీ చేసిన మెమో కాపీలను పార్టీ నేతలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ గతంలోనూ ఇదేవిధంగా అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించి, వాటర్‌క్యాన్లు ఉపయోగించిన చరిత్ర హీనుడు చంద్రబాబు అని మండి పడ్డారు. అంగన్‌వాడీల పోరాటానికి తమ పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు రద్దుచేస్తామంటూ మహిళల ఓట్లతో గెలిచిన చంద్రబాబు అన్నిరకాలుగా వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ మహిళలతో కంట నీరు పెట్టించిన ఏ ఒక్క ప్రభుత్వం మనుగడ సాగించలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పలు విభాగాల నేతలు ఆతుకూరి ఆంజనేయులు, పోలూరి వెంకటరెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, పల్లపు రాఘవ, నరాలశెట్టి అర్జున్, దాసరి కిరణ్, జగన్‌కోటి, మెట్టు వెంకటప్పారెడ్డి, నాగం కాశీవిశ్వనాథ్, గనిక ఝాన్సీరాణి, అత్తోట జోసఫ్, శిఖా బెనర్జీ, ఆవుల సుందరరెడ్డి, మేరువ నర్సిరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, మర్రి వెంకట్రావు, అందుగల రమేష్, గేదెల రమేష్, ఆబిద్‌బాషా, నిమ్మరాజు శారదాలక్ష్మి, గంగవరపు సరోజసుధ, విజయమాధవి పాల్గొన్నారు.
అంగన్‌వాడీల తొలగింపు ఉత్తర్వుల కాపీలు దహనం
గుంటూరు వెస్ట్ : అంగన్‌వాడీలు బకాయిలు చెల్లించాలని, పెంచిన జీతాల జీఓను విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 18న విజయవాడలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ను విధుల నుంచి తొలగించాలని ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలను గురువారం స్థానిక శంకర్ విలాస్ సెంటర్‌లో సీఐటీయూ నాయకులు దహనం చేశారు. సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతకుముందు బ్రాడీపేటలోని యూనియన్ కార్యాలయం నుంచి శంకర్‌విలాస్ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యద ర్శి కాపు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన టీడీపీ, అధికారంలోకి రాగానే ఆందోళనలు చేపడుతున్న వారిపై నిరంకుశంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం నాయకుడు వీవీకే సురేష్ మాట్లాడుతూ అంగన్‌వాడీలకు బకాయిల జీతాలు చెల్లించడంతోపాటు, పెంచిన జీతాల జీఓను విడుదల చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.నళినీకాంత్, నాయకులు కాకుమాను నాగేశ్వరరావు, నగర కార్యదర్శి కట్లగుంట శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.ఆర్.దేవి, ఎల్.అరుణ, ఎస్‌కే షకీలా తదితరులు పాల్గొన్నారు.