కలెక్టరేట్ (కాకినాడ), న్యూస్‌లైన్ :కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ నాయకులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు శనివారం ఉదయం భగ్నం చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించా లన్న ప్రధాన డిమాండ్లతో.. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వీరలక్ష్మితో పాటు 25 మంది ఐదు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అధిక సంఖ్యలో మోహరించిన పోలీసులు దీక్ష చేస్తున్న వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు శనివారం ఉదయం ప్రయత్నించారు. వారిని అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతిఘటించేందుకు విఫల యత్నం చేశారు. దీక్ష చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
దీక్షలు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరం నుంచి జెడ్పీ సెంటర్, జీజీహెచ్, శాంతిభవన్ మీదు గా బాలాజీచెరువు సెంటర్ వరకూ ర్యాలీ చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సర్కిల్ వద్ద గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17 నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెకు జిల్లాలోని 25 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఉద్యమంపై ఉక్కుపాదం
Published Sun, Feb 16 2014 1:00 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement