జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తల నియామకానికి విడుదల చేసిన నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పాలకొండ డివిజన్‌లోని వీరఘట్టం,
అంగన్‌వాడీ నోటిఫికేషన్లలో అన్నీ తప్పులే...
రిటైర్ అవుతున్న వారు ఎక్కువ... చూపిస్తున్న పోస్టులు తక్కువ
వీరఘట్టం/పాలకొండ:
జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తల నియామకానికి విడుదల చేసిన నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పాలకొండ డివిజన్‌లోని వీరఘట్టం, పాలకొండ, బూర్జ, కొత్తూరు, రాజాం, సారవకోట ప్రాజెక్టుల పరిధిలో 27 మంది కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే కేవలం వీరఘట్టం ప్రాజెక్టు పరిధిలోని వీరఘట్టంలోనే 11 మంది పదవీవిరమణ పొందారు. ఒక పోస్టు కోర్టు పెండింగ్‌లో ఉంది. వంగర మండలంలో 18 కార్యకర్తల పోస్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో 29 ఖాళీలు ఉండగా, పాలకొండ డివిజన్‌లో 27 ఖాళీలు ఉన్నాయని ఏవిధంగా నోటిఫికేషన్ ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు.పాలకొండ మండలంలో ఐదుగురు కార్యకర్తలు, ఆరుగురు సహాయ కార్యకర్తల ఖాళీలు ఉండగా ఇక్కడ కేవలం ఐదే ఖాళీలు ఉన్నట్లు అధికారులు చూపించారు. ఈ లెక్కన చూస్తే జిల్లాలో ప్రతి మండలంలోను కార్యకర్తల పోస్టుల ఖాళీలు 8 నుంచి 15 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు తక్కువకు నోటిఫికేషన్ ఇవ్వడంలోగల ఆంతర్యమేమిటన్నది తేలాల్సి ఉంది.
నిరాశలో నిరుద్యోగ మహిళలు
తమ మండలాల్లో పదవీ విరమణ చేసిన వారితో పాటు గతంలో ఖాళీగా ఉన్న పోస్టులకు పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ ఇస్తారనుకుంటే కేవలం మండలాల్లో అరకొర పోస్టులే ఉన్నట్లు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ పోస్టుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టుల ఇంటర్య్వూలకు వెళ్ళి ఆ పోస్టులు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ మహిళలకు నిరాశే మిగిలింది. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారు ఎక్కువగా ఉన్నప్పుటికీ చూపిస్తున్న పోస్టులు తక్కువగా ఉండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి చక్రధర్ వద్ద సాక్షి ప్రస్తావించగా ప్రాజెక్టు పరిధిలోని పీఓలు చూపించిన ఖాళీల మేరకు నోటిఫికేషన్ ఇచ్చామని, మరోసారి పీఓలతో సంప్రదిస్తామనీ తెలిపారు.