► అంగన్‌వాడీల మధ్య చిచ్చుపెట్టిన టీడీపీ
► తెలుగునాడు పేరిట కొత్త యూనియన్ ఏర్పాటు
► సభ్యులుగా చేరాలని అంగన్‌వాడీలపై ఒత్తిడి
ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను టార్గెట్ చేస్తోంది. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత అమలుపరచకపోవడంతో అంగన్‌వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు అంగన్‌వాడీలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు పార్టీ ఏర్పాటు చేసిన తెలుగునాడు అంగన్‌వాడీ యూనియన్‌లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వామపక్షాల అనుబంధంగా ఉన్న అంగన్‌వాడీలు తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపడుతున్నారు. వేతనాలు పెంచాలంటూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్నీ ముట్టడించారు. దీంతో ప్రభుత్వం కుటిల రాజకీయాలకు తెరలేపింది. అంగన్‌వాడీలను తమ వైపు తిప్పుకోవటానికి, వారిలో అనైక్యత కోసం పావులు కదిపింది. ఇందులో భాగంగానే అధికార టీ డీపీ అనుబంధ సంఘంగా తెలుగునాడు అంగన్‌వాడీ యూనియన్‌ను ఏర్పాటు చేసి అధికారులు, పార్టీ నేతల ద్వారా తమ యూనియన్‌లో చేరాలని హుకుం జారీచేస్తున్నారు.
అంగన్‌వాడీలపై ఆశల వల...
జిల్లాలో 23 ఐసీడీఎస్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటిల్లో 4,351 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 4,351 ఆయాలు, మినీ అంగన్‌వాడీ టీచర్లు 54 మంది పనిచేస్తున్నారు. న్యూట్రిషన్ కౌన్సిలర్లు 896 మంది పనిచేస్తున్నారు. ఎక్కువ మంది వామపక్షాల అనుబంధ యూనియన్లల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. సీపీఎంలో 5 వేలమంది, సీపీఐలో 230 మందికి సభ్యత్వం ఉంది. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు.
దీంతో ఈ యూనియన్‌ల ప్రాబల్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు టీడీపీ తెలుగునాడు అంగన్‌వాడీ యూనియన్‌ను ఏర్పాటు చేసింది. తమ యూనియన్‌లో చేరాలని, ఇందుకోసం సభ్యత్వ రుసుం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ మొత్తాలను తాము చెల్లిస్తామంటూ నేతలు ముందుకు వస్తున్నారు. సభ్యులుగా చేరిన వారికి నివేశన స్థలాలు, ఇళ్లు ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలలో రూ. 2లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని చెబుతున్నారు.
ఇందుకు సీడీపీవోలను కూడా వినియోగించుకుంటున్నారు. జిల్లాలో ఉన్న అంగన్‌వాడీల్లో సగం మందినైనా తమ యూనియన్‌లో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం మంగళగిరిలో జరిగిన అంగన్‌వాడీల సమావేశంలో ఐసీడీఎస్ అధికారులు తెలుగునాడు అంగన్‌వాడీ యూనియన్‌లో చేరాలని ఆదేశించారు.
యూనియన్ ఏర్పాటులో అంతర్భావం ఇదే..
అంగన్‌వాడీలు రోడ్డెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇటీవల ప్రభుత్వానికి మహిళలు చలో విజయవాడ, తదితర ఆందోళన కార్యక్రమాల ద్వారా చవిచూపారు. అంగన్‌వాడీల పోరాటాలు, ఉద్యమాలు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారాయి. అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. విజయవాడ ఆందోళనలలో పాల్గొన్న వారి పేర్లు సేకరించే క్రమంలో వివాదాలు చెలరేగటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
వీటికన్నా అంగన్‌వాడీల మధ్య విభేదాలు సృష్టించి, వారిలో అనైక్యతకు ఆజ్యం పోస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని గ్రహించారు. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తెలుగునాడు అంగన్‌వాడీ యూనియన్ ఏర్పాటైంది. యూనియన్‌లో అత్యధిక మందిని సభ్యులుగా చేర్చాలని అధిష్టానం ఆదేశించడంతో గ్రామస్థాయి నుంచి అంగన్‌వాడీలను టార్గెట్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు తమ ప్రతాపం చూపటం ప్రారంభించారు.
సమస్యల పరిష్కారం మరచి...
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్‌వాడీలు, ఆయాల సమస్యలు మరింత పెరిగాయి. అంగన్‌వాడీలు తమ సేవలను ఆన్‌లైన్ చేయటానికి అదనంగా రూ.500 వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో సరుకులు, గ్యాసు అంగన్‌వాడీ సెంటర్లకు వెళ్లేవి. ప్రస్తుతం సరుకులు, గ్యాసు అంగన్‌వాడీలే తెచ్చుకోవాలి. లబ్ధిదారులను బట్టి సరుకుల మంజూరు కూడా జరగటం లేదు. వేతన బకాయిలు చెల్లించటంలో జాప్యం జరుగుతుంది. ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి అధికారంలో ఉన్న టీడీపీ యూనియన్ ఏర్పాటు పేరుతో అంగన్‌వాడీల మధ్య అగ్గి రాజేస్తోంది.
విభజించు..పాలించు..!
Published Mon, Mar 21 2016 1:41 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement