అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నా.. వీరి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. అరకొర వేతనాలిస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటోంది. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం తరచూ ఆందోళనలు చేస్తున్నా...సర్కారుకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 4,286 అంగన్‌వాడీ, 840 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 4,286 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 781 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 3,993 మంది ఆయాలు (హెల్పర్లు) పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 3-5 ఐదేళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను కూడా బోధిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ పాలు పంచుకుంటున్నారు. అయితే...వీరికి అందుతున్న వేతనాలు నామమాత్రమే. ‘గౌరవ వేతనం’ అని ముద్దుపేరు పెట్టిన ప్రభుత్వం అరకొరగా విదుల్చుతోంది.
సుప్రీం కోర్టు ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం
పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.4263, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి రూ.4231, కొత్తగా నియమితులైన వారికి రూ.4200, ఆయాలకు రూ.2200 చొప్పున వేతనాలు చెల్లిస్తోంది. మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పరిస్థితి మరింత దయనీయం. ప్రధాన కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా రూ.2200 మాత్రమే ఇస్తోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం రూ.12 వేలు తగ్గకుండా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం అమలు చేయడం లేదు.
చెప్పేదొకటి..చేసేదొకటి
అంగన్‌వాడీ ఉద్యోగ నియామకాల సమయంలో సిబ్బందికి చెబుతున్న జాబ్‌చార్ట్‌కు, నియమితులైన తర్వాత చేయిస్తున్న పనులకు పొంతన లేకుండా పోతోంది. వాస్తవానికి చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యాబోధన, పౌష్టికాహార పంపిణీ, చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం పనిచేయడమే అంగన్‌వాడీల విధులు. అయితే.. ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలోనూ అంగన్‌వాడీలను భాగస్వామ్యం చేస్తోంది. కాదూ కూడదంటే ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరిస్తోంది. చివరకు రాజకీయ పార్టీల కార్యకర్తలు చేయాల్సిన పనిని కూడా అంగన్‌వాడీలకు అప్పగిస్తున్నారు. ఓటరు జాబితా తయారీ, ఓటరుకార్డుల పంపిణీ, ఇంటింటా సర్వే వంటి అనేక ఇతర పనులను వారితో చేయిస్తున్నారు.
నిర్వీర్యమవుతున్న అంగన్‌వాడీ వ్యవస్థ
అంగన్‌వాడీల బలోపేతానికి కృషి చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అంగన్‌వాడీ వ్యవస్థను తొలగించి పౌష్టికాహారం అందించే బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజలు, అంగన్‌వాడీల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ప్రస్తుతానికి వెనకడుగు వేస్తోంది. అయితే... ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో పౌష్టికాహార కేంద్రాల పేరుతో పోటీ కేంద్రాలను ప్రారంభిస్తోంది. జిల్లాలో ఐకేపీ ద్వారా 13 మండలాల్లో పౌష్టికాహార కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అంగన్‌వాడీ సెంటర్లు నిర్వీర్యమవుతున్నాయి. మెల్లమెల్లగా తమను శాశ్వతంగా తొలగించేందుకే ప్రభుత్వం ఇలా కుట్ర పన్నుతోందని అంగన్‌వాడీలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా 27న ధర్నా
అంగన్‌వాడీ సిబ్బందితో ప్రభుత్వం వెట్టిచాకిరీ చే యించుకుంటోంది. అనేక ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా మా సమస్యలను పట్టించుకోవడం లేదు. చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నాం., పనిఒత్తిడి తట్టుకోలేక అ నారోగ్యాల బారిన పడుతున్నాం. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తాం.
- వనజ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ ఆదేశాలను గౌరవించాలి
గ్రామాల్లో ప్రజల సంక్షేమ కోసం ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఏ పనులు అప్పగించినా మేము గౌరవించాల్సిందే. అంతేకానీ.. వాటితో సంబంధం లేదని చెప్పకూడదు. ఏ కార్యక్రమమైనా ప్రజల కోసమే అనే భావనతో పనిచేస్తున్నాం. అంగన్‌వాడీలతో ఇతర పనులు చేయించకూడదని ఉత్తర్వులు వచ్చాయి. అయితే... గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది కొరత వల్ల అంగన్‌వాడీల సేవలను ఉపయోగించుకుంటున్నారు. వేతనాలు తక్కువ అందుతుండడం వాస్తవమే. అయితే...వేతనాలు పెంచుతూ ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలి.
- సువర్ణలత, అదనపు ప్రాజెక్టు డెరైక్టర్, ఐసీడీఎస్
గొడ్డు చాకిరీ
Published Sat, Jan 25 2014 1:45 AM | Last Updated on Fri, Aug 17 2018 5:18 PM
Advertisement