‘పావలా కోడికి ముప్పావలా మసాలా’ అన్నట్టు ఉంది ప్రభుత్వం నిర్మిస్తున్న అన్న క్యాంటీన్ల తీరు. ఐదు రూపాయలకే భోజనం, అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఇవి అవినీతికి ఆలవాలంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటినిర్మాణానికి భారీ అంచనాలు రూపొందించి నిధుల విడుదల చేసిన ప్రభుత్వం కమీషన్లు దండుకోవడానికి తెర తీసిందని జనం చర్చించుకుంటున్నారు.
అమలాపురం టౌన్: అన్న క్యాంటీన్ భవన నిర్మాణాలు సొమ్ములు ఎక్కువ సోకులు తక్కువ అన్నట్టుగా ఉన్నాయి. అధిక అంచనాలతో భవనం కోసం వెచ్చించిన వ్యయం అనుమానాలకు తావిస్తోంది. కేవలం రెండు సెంట్ల లోపు స్థలంలో అన్న క్యాంటీన్ భవనాన్ని ఏకంగా రూ.36 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. రాష్ట్రమంతా ఒకే డిజైన్‌తో..ఒకే అంచనా వ్యయంతో వీటిని రూపొందిస్తున్నారు. భవన నిర్మాణాలను కూడా ప్రభుత్వం తమకు కావా ల్సిన కొన్ని కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించింది. అన్న క్యాంటీన్లు నిర్మిస్నున్న స్థలం విస్తీర్ణం 83.33 గజాలు. అదే రెండు సెంట్ల స్థలమంటే 96.44 గజాలు. 83.33 గజాల స్థలాన్ని ఇంజనీరింగ్ పరిభాషలో 750 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణం అంటారు. ఇంత చిన్న స్థలంలో రూ.36 లక్షల వ్యయంతో భవవ నిర్మాణమంటే అంత వ్యయం అవసరమా..? అనే ప్రశ్న..సందేహం ఎవరికైనా కలుగుతాయి. లే అవుట్స్‌లో నాలుగు లేదా అయిదు సెంట్ల భూమిలో అన్ని హంగులతో ఇల్లు నిర్మించుకుంటే రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ వ్యయమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అన్న క్యాంటీన్లు కేవలం రెండు సెంట్ల స్థలంలో నిర్మించే భవనం కోసం రూ.36 లక్షల వ్యయం అవసరమా...? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
క్యాంటీన్ సదుపాయాలన్నీఆ వ్యయంలోనే అంటున్న అధికారులు
అన్న క్యాంటీన్ నిర్మాణ వ్యయంగా నిర్దేశించిన రూ.36 లక్షలతో భవన నిర్మాణంతో పాటు భవనం పూర్తయ్యాక అందులో క్యాంటీన్‌కు అవసరమైన పొయ్యిలు, భోజనాలు చేసేందుకు అవసరమైన ఫర్నీచర్, పాత్రలు తదితర వ్యయాలన్నీ అందులోనే ఉంటాయని అధికారులు వివరణ ఇస్తున్నారు. నాలుగు లేదా అయిదు సెంట్ల భూమిలో ఏదైనా లే అవుట్ స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారు రూ.30 నుంచి రూ.40 లక్షల వ్యయంలోనే భవన నిర్మాణ ఖర్చులతో పాటు ఎలివేషన్, ఇంటిరీయర్ డెకరేషన్, ఆల్‌టెక్, గ్రానైట్, మార్బుల్‌తో రెండు బెడ్ రూమ్‌లతో ఇల్లు పూర్తి చేయడం గమనార్హం. జిల్లాలో రెండు నగరాలు, ఏడు పట్టణాల్లో 14 అన్న క్యాంటీన్లు నిర్మించేందుకు రంగం సిద్ధం అయింది. కాకినాడలో అయిదు, రాజమహేంద్రవరంలో రెండు, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం, గొల్లప్రోలులో ఒక్కొక్కటి వంతున ఈ క్యాంటీన్లు నిర్మించేందుకు ఏర్పాట్లు జరిగాయి.
ఇప్పటి వరకూ రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో చెరో రెండు మొత్తం నాలుగు అన్న క్యాంటీన్ల భవనాలు పూర్తయి ప్రారంభమయ్యాయి. కాకినాడ నగరంలో ఇంకా మూడు క్యాంటీన్లు, మూడు మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో క్యాంటీన్ల నిర్మాణానికి అవసరమైన రెండు సెంట్ల స్థలాలను అక్కడి పాలకవర్గాలు ఇంకా చూపించలేకపోయాయి. అమలాపురం మున్సిపాలిటీలో అయితే ఇప్పటికే రెండుచోట్ల ఎంపిక చేసిన స్థలాలు వివాదాస్పదమయ్యాయి. మాకు ఇక్కడ అన్న క్యాంటీన్ వద్దు అంటూ వ్యతిరేకత, అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మూడో ప్రయత్నంగా అధికారులు స్థల అన్వేషణలో పడ్డారు. రాష్ట్ర స్థాయిలోనే అన్న క్యాంటీన్ల భవనాల నిర్మాణ అంచనాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అదే తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా క్యాంటీన్ల నిర్మాణం సమంజసమైన అంచనా వ్యయాలతో...ఎకానమీ కోణంలో ఉన్నాయని అంటున్నారు. కేవలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు మించని వ్యయాన్ని ఏకంగా రూ.36 లక్షల అధిక అంచనాలతో రూపొందించింది అందిన కాడికి దోచుకోవడానికే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాధనం దోచుకోవడానికి పక్కా వ్యూహంతో అన్న క్యాంటీన్ల నిర్మాణాల పరంపర సాగుతోందని ప్రైవేటు సివిల్ ఇంజనీర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment