
పందులఫాం వద్ద క్యాంటీన్ వద్ద సెక్యూరిటి గార్డును నిలదీస్తున్న ప్రజలు
అన్న క్యాంటీన్లు కాస్తా అన్నమో రామచంద్ర..అన్నట్టుగా తయారయ్యాయి. ఆర్భాటంగా ప్రారంభించిన ఈ క్యాంటీన్లు తొలిరోజు మధ్యాహ్నమే మూతపడ్డాయి. ఇక రెండో రోజైనా పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయన్న ఆశతో వెళ్లిన సామాన్యులు నిరాశతో వెనక్కి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. అల్పాహారం, భోజనం కోసం ప్రజలు బారులు తీరారు. తీరా క్యాంటీన్ సిబ్బంది, సెక్యుక్యూరిటీ గార్డులను లేవని చెప్పడంతో వారిని నిలదీయడం కన్పించింది.
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు కొలువు దీరాయి. రూ.5కే అల్పాహారం, రూ.5 ఆహారం అంటూ గొప్పలు చెబుతూ జీవీఎంసీ పరిధిలో బుధవారం అట్టహాసంగా 13 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభించారు. అయితే బుధవారం ప్రారంభించిన వాటిలో గురువారం సగానికి పైగా తెరుచుకోలేదు.మరికొన్ని చోట్ల కేవలం మధ్యాహ్నం కొద్దిసేపు భోజనం పెట్టి మూసేశారు. మరికొన్ని వాటిల్లో ఉదయం అల్పాహారంతో సరిపెట్టేశారు.తెరిచిన క్యాంటీన్లు కూడా మధ్యాహ్నం 1 గంటకే మూసేసారు.
విశాఖ తూర్పు నియోజకవర్గం 3వ వార్డు పందులఫాం ఏరియాలోని క్యాంటీన్ అసలు తెరవనేలేదు. మరో చోట భోజం కోసం చేరుకున్న సామాన్యులకు అక్కడి సిబ్బంది చెప్పిన సమాధానం కాకపుట్టింది.
క్యాంటిన్ టైం అయిపోయింది..300 మందికి భోజనం పెట్టేశాం అని చెప్పడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. సిబ్బందిని చెడామడా తిట్లదండకంతో ఉతికిఆరేశారు. దొడ్డిదారిన క్యారేజీలు పంపించి ఉంటారంటూ మండిపడ్డారు. లోనికి వెళ్లేందుకు యత్నించారు. సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చినవాల్తేరులోనూ అదే పరిస్థితి
చిన వాల్తేరులో ప్రారంభిన క్యాంటీన్ పరిస్థితి కూడా ఇదే. ట్రయల్‌రన్ అంటూ బుధవారం ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు అందజేసిన నిర్వాహకులు గురువారం ముఖం చాటేశారు. అదేమిటంటే క్యాంటీన్‌లో ఇంకా పనులు జరుగుతున్నాయని..త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాం అంటూ చెప్పడం విస్మయానికి గురిచేసింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు రూ.5కే అందజేస్తామని చెప్పడంతో అధికసంఖ్యలో వచ్చిన భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బండి వ్యాపారులు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment