27 తర్వాతే ఏఆర్‌ఆర్‌లు!
డిస్కంలకు సీఎం బ్రేక్
దావోస్ నుంచి హడావుడిగా ఆదేశం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ విద్యుత్ చార్జీల ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో సర్కారులో ఆందోళన మొదలైంది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేయడంతో దావోస్‌లో ఉన్న ముఖ్యమంత్రి ఉలిక్కిపడ్డారు. వార్షిక ఆదాయ అవసర నివేదిక (ఏఆర్‌ఆర్)లకు శనివారం ఆఖరు తేదీ కావడంతో హడావుడి మొదలు పెట్టారు. ఈ నెల 27న కేబినెట్‌లో చర్చించిన తర్వాతే ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ పంపిణీ సంస్థల సీఎండీలను శుక్రవారం కోరారు. మరోవైపు ఇంధనశాఖ కార్యదర్శి సలహాదారు రంగనాథం రంగంలోకి దిగారు. ఏఆర్‌ఆర్‌ల గడువు పెంచాలని కోరుతూ రాత్రికి రాత్రి ఓ విన్నపాన్ని తయారు చేసినట్టు తెలిసింది. పంపిణీ సంస్థల సీఎండీలను తీసుకుని ఆయన శనివారం ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను కలిసే వీలుంది. సుమోటోగా టారిఫ్ నిర్ణయిస్తామని ఈఆర్‌సీ ప్రకటించడంతో, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ సంస్థపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యమంత్రి దావోస్ నుంచి వచ్చే వరకూ నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఓ ఉన్నతాధికారి ఈఆర్‌సీకి ఫోన్ చేసినట్టు సమాచారం. మొత్తం మీద విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన సర్కారుకు నిద్ర పట్టనివ్వడం లేదు.
దాదాపు రూ. 7 వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారం మోపాల్సి ఉంటుందని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. అయితే ప్రజలపై భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. అలాగని ఏఆర్‌ఆర్‌ల సమర్పణకు డిస్కమ్‌లకు అనుమతినివ్వలేదు. దీంతో విద్యుత్ నియంత్రణ మండలే సుమోటోగా టారిఫ్ ప్రకటించే వీలుందని తెలియడంతో, ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు వస్తాయని నిపుణులు సూచించారు. జ్యుడీషియల్ బాడీ ఆదేశాలను ఖాతరు చేయకపోతే డిస్కమ్‌లపై చర్యలు తీసుకునే వీలుందని చట్టంలో స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పంపిణీ సంస్థల సీఎండీలూ డోలాయమానంలో పడ్డారు. అయితే ప్రజలపై ఈ స్థాయిలో భారం వేయడం వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత రావచ్చని భావించిన సర్కారు, డిస్కమ్‌ల చేతులను కట్టిపడేసింది.