'భూములిచ్చిన రైతులకు ఎకరానికి అదనంగా రూ.20 వేలు'
పశ్చిమగోదావరి: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు టీడీపీకి 15 సీట్లిచ్చి పూర్తి మద్దతు పలికారని, పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో వారి రుణం తీర్చుకుంటానన్నారు. జిల్లాలో నిట్, మెరైన్ ఇంజనీరింగ్ యూనివర్శిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కృష్ణాకు తరలిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామన్నారు. అంతేకాకుండా రాబోయే రెండు నెలల్లో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామన్నారు. తనపై నమ్మకంతో రాజధాని ప్రాంత రైతులు 35 వేల ఎకరాల భూములు ఇవ్వడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. అంతేకాకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పంటనష్టం కింద ఎకరానికి రూ.20 వేలు అదనంగా అందజేస్తామని రైతులకు చంద్రబాబు హామీ ఇచ్చారు.