మరో మృతదేహం లభ్యం
బియాస్ నదిలో గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యామ్ దుర్ఘటనలో గల్లంతైన వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో మరొకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. బియాస్ నదిలోని పండో డ్యాం బ్యాక్ వాటర్‌లో తేలిన ఆ మృతదేహం పి.వెంకట దుర్గా తరుణ్‌గా గుర్తించారు. అక్కడే దొరికిన మరో మృతదేహం స్థానికుడిదిగా తేలింది. అదేప్రాంతంలో మూడో మృతదేహం కనిపించింది. అయితే గజ ఈతగాళ్లు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలు దొరికాయని, మిగతా 15 మృతదేహాలకోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. బియాస్ నది వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి బుధవారం అక్కడినుంచే ‘సాక్షి’తో మాట్లాడుతూ 11వ రోజు గాలింపు వివరాలు తెలిపారు.
ఆయన చెప్పిన మేరకు... ఉదయం ఆరు గంటల నుంచి దాదాపు 200 బోట్లతో 600 మంది ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు తెలంగాణకు చెందిన పోలీసు గజ ఈతగాళ్లు విస్తారంగా గాలింపు చర్యలను చేపట్టారు. పండో డ్యాం బ్యాక్ వాటర్‌లో రెండు మృతదేహాలు తేలడాన్ని గమనించి స్వాధీనం చేసుకున్నారు. మరో మృతదేహాన్ని అందుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్వాధీనం చేసుకున్న రెండు మృతదేహాలను ఒడ్డుకు తీసుకురాగా అందులో ఒకటి గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థి వెంకట దుర్గా తరుణ్‌గా అక్కడున్న కాలేజీ ఫ్యాకల్టీ గుర్తించారు. మరో మృతదేహం స్థానికుడిదిగా మండి పోలీసులు తేల్చారు. దీంతో పోస్టుమార్టం పూర్తయ్యాక తరుణ్ మృతదేహాన్ని రోడ్డుమార్గం ద్వారా ఢిల్లీలోని ఏపీ భవన్‌కు తరలించారు. అక్కడినుంచి గురువారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. చివరి మృతదేహం దొరికేంతవరకు తాను, రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ సెక్రటరీ లవ్ అగర్వాల్, అదనపు డీజీ రాజీవ్ త్రివేది, గ్రేహౌండ్స్ ఎస్పీ కార్తికేయ, ఇతర పోలీసులు ఇక్కడే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.
కుప్పకూలిన తరుణ్ తల్లిదండ్రులు
బియాస్ ఘటనలో తమ కుమారుడు వెంకటదుర్గ తరుణ్ మృతిచెందాడని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గుంటూరు జిల్లా పిడపర్తిపాలెంకు చెందిన తరుణ్ తల్లిదండ్రులు సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులు చందానగర్‌లోని టెల్‌కట్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. తరుణ్ రెండవ కుమారుడు. కాగా, సీఎం కేసీఆర్‌ను డీజీపీ అనురాగ్ శర్మ బుధవారం కలిసి బియాస్ నదిలో గాలింపు చర్యలపై వివరాలను వెల్లడించారు.