కాన్వెంట్ జంక్షన్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరో ఫ్లైఓవర్ రాబోతోంది. ఇప్పటికే ఆశీలుమెట్ట నుంచి రైల్వేస్టేషన్ వరకు ఒకటి, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వెళ్లేందుకు మరొక ఫ్లైఓవర్ ఉన్నాయి. ఎన్‌ఏడీ జంక్షన్లో మరో ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతోంది. తాజాగా కాన్వెంట్ జంక్షన్ నుంచి విశాఖ పోర్టు వరకు మరో కొత్త ఫ్లైఓవర్ రానుంది. దీంతో విశాఖలో ఫ్లైఓవర్ల సంఖ్య నాలుగుకు చేరుతుంది. కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టులో దీనిని నిర్మించనుంది. ఈ వంతెనకు రూ.60 కోట్లు వ్యయం కానుంది. ఇందులో సివిల్ పనులకు రూ.44.32 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం వ్యయంలో సగం సొమ్మును కేంద్ర ప్రభుత్వం, మిగిలిన సగం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), విశాఖ పోర్టు ట్రస్టు (వీపీటీ)లు సంయుక్తంగా భరిస్తాయి.
ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు వరకు ఉన్న రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డులో ప్రమాదాల బారిన పడి ఏటా సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారు. పది మందికి పైగా గాయాలపాలవుతున్నారు. పైగా ఈ రోడ్డులో వాహనాల సంఖ్య పెరిగిపోతుండడంతో ట్రాఫిక్ రద్దీ అధికమవుతోంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీంతో కేంద్రం దీనిని సాగరమాల ప్రాజెక్టులో చేర్చింది. కాన్వెంట్ జంక్షన్ నుంచి పోర్టు లోపల ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు 724 మీటర్ల మేర ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తారు. ఇందుకోసం ఇటీవల టెండర్లను కూడా పిలిచారు. వీటిలో అత్యల్పంగా కోట్ చేసిన సంస్థకు నెలాఖరుకల్లా టెండరు ఖరారు చేయనున్నామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment