ఎయిర్‌పోర్టు వ్యవహారం మరో ప్రాణాన్ని బలిగొంది. తన కుటుంబానికి జీవ నాధారమైన అర ఎరం కూ డా మిగలదన్న భయంతో మరో
భోగాపురం: ఎయిర్‌పోర్టు వ్యవహారం మరో ప్రాణాన్ని బలిగొంది. తన కుటుంబానికి జీవ నాధారమైన అర ఎరం కూ డా మిగలదన్న భయంతో మరో గుండె ఆగిపో యింది. గూడెపువలస పంచాయతీ వెంపాడపేటకు చెందిన వెంపాడ సూరి (52) అనే రైతుకు ఎకరా 60 సెంట్ల భూమి ఉండేది. పిల్లల పెళ్లిల కోసం కొంత భూమి అమ్మేశారు. ఎయిర్‌పోర్టు నోటిఫికేషన్ వెలువడడంతో ఆ ఉన్న కాస్త భూమికూడా పోతుందన్న బెంగతో సూరి తల్లడిల్లిపోయారు. తనభూమినికాపాడుకోవడం కోసం తానూ పోరాటంలో పాల్గొన్నారు. గూడెపువలసలో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్ష శిబిరంలో కూడా పాల్గొంటున్నారు .
అయితే శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారని, శనివారం నుంచి భూముల యజమానులకు నోటీసులు జారీచేస్తారని తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం రాత్రి సరిగా నిద్రపోలేదని, శనివారం ఉదయం 3గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వచ్చిన సూరి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సూరికి భార్య బంగారమ్మతోపాటు కొడుకు, కూతురు ఉన్నారు.
నాయకుల పరామర్శ: విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, భెరైడ్డి ప్రభాకరరెడ్డి, మండల కన్వీనరు దారపు లక్ష్మణరెడ్డి, కొల్లి రామ్మూర్తి, కొండపు లక్ష్మణరెడ్డి, కొండపు శ్రీనివాసుల రెడ్డి, కేశవరావు రమణారెడ్డి, మట్ట వెంకటరమణారెడ్డి తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎయిర్‌పోర్టు విషయంలో ఎవరూ బెదిరిపోనక్కరలేదనీ, అందరూ ధైర్యంగా ఉండాలనీ వారు కోరారు.