అమరావతి పేరుతో మరో దుబారా! | Another Scam In The Name Of Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతి పేరుతో మరో దుబారా!

Published Thu, Jan 31 2019 4:50 AM | Last Updated on Thu, Jan 31 2019 4:50 AM

Another Scam In The Name Of Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ‘పోలవరం’ సినిమా చూపిస్తున్నట్లుగానే రాజధాని అమరావతి సినిమానూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు చూపించబోతున్నారు. రాజధాని నిర్మాణంలో తీవ్రంగా అభాసుపాలై.. తాత్కాలిక నిర్మాణాలతో కాలక్షేపం చేస్తున్న సర్కార్‌ ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రభుత్వ ఖర్చులతో అక్కడి పునాదులను రాష్ట్ర ప్రజలకు చూపించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా రూ.39.88 కోట్లను ఖర్చు పెట్టనుంది. ఉదయం టీ, కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెట్టిస్తున్న సీఆర్‌డీఏ, ఒక్కో వ్యక్తి డిన్నర్‌కు మాత్రం రూ.150ను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికార యంత్రాంగం తీవ్రంగా తప్పుపడుతోంది.

ఓ పక్క రాష్ట్రం రెవెన్యూ లోటులో కొట్టుమిట్టాడుతుండగా.. మరోపక్క ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి, 108 అంబులెన్స్‌లకు అవసరమైన డీజిల్‌కు నిధులు ఇవ్వలేని దారుణ పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే.. ఇప్పుడు రాజధానిలో నిర్మాణాలు చూపించడానికి ప్రతిజిల్లా నుంచి జనాల్ని తరలించడానికి నిధులు దుబారా చేయడంపై ఉన్నతాధికార వర్గాలతో పాటు సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. నెలకు రూ.30 కోట్లు ఖర్చయ్యే డీఏను ఉద్యోగులకు, పెన్షనర్లుకు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన సర్కారు రాజధానికి ప్రజలను తరలించడానికి కోట్ల రూపాయలు ఎలా ఖర్చుపెడుతుందని సచివాలయ ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ అద్భుత కట్టడాలుంటే ప్రజలే తమంతట తామే వచ్చి చూస్తారని వారంటున్నారు. వర్షం వస్తే లోపలికి నీళ్లు వచ్చేసే తాత్కాలిక సచివాలయం చూసేందుకు జనాలను తరలించాలనుకోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వ నేత ఆలోచనలు పతాక స్థాయికి చేరుకున్నాయని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఏదో ఒకటి ఈవెంట్ల తరహాలో నిర్వహిస్తే రాజధానిలో ఏదో జరిగిపోతోందనే ప్రచారం జరుగుతుంది తప్ప వాస్తవానికి ఏమీ ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

రెండు నెలలకు రూ.39.88కోట్ల ఖర్చు
కాగా, ప్రతీ జిల్లా నుంచి ప్రజలను అమరావతికి తరలించేందుకు బస్సులు ఏర్పాటుచేయడంతో పాటు అమరావతిలో బస, భోజనం తదితర ఏర్పాట్ల కోసం మార్చి నెల వరకు రూ.39.88 కోట్లు ఖర్చు అవుతుందని సీఆర్‌డీఏ లెక్క కట్టింది. ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం కూడా తీసుకుంది. రైతులు, విద్యార్థులను తరలించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు చూపించడానికి రూ.84.50 కోట్లుఖర్చుచేశారు. తాజాగా మరో రూ.100 కోట్లు మంజూరు చేయాలని సాగునీటి శాఖ ప్రతిపాదనలను పంపగా ఆర్థిక శాఖ పెండింగ్‌లో పెట్టింది. ఇలాంటి వ్యయాలన్నీ కూడా దుబారా కిందకే వస్తాయని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నిజంగా అద్భుత నిర్మాణాలు నిర్మిస్తే ప్రజలు వారంతట వారే చూసేందుకు వస్తారని, ఇలా బలవంతంగా తరలింపు ఎందుకని ఆ అధికారి అనడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement