అన్ని వర్గాల వారితో అంటోనీ కమిటీ భేటీ: పల్లంరాజు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల వారితోనే కాకుండా అన్ని వర్గాల ప్రజలతో అంటోనీ కమిటీ భేటీ అవుతుందని కేంద్ర మంత్రి ఎం.ఎం. పల్లంరాజు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌కు వచ్చే ఈ కమిటీ హైదరాబాద్‌లోని విద్యార్థులు, ఉద్యోగులు వివిధ వర్గాల వర్గాల వారితో సమావేశమై వారికున్న భయాందోళనలపై వివరాలు తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రాయలసీమకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుందని, నీటి పంపకాలపై సమాచారం సేకరిస్తుందని వివరించారు.
శనివారం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పల్లంరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రా, రాయలసీమ ప్రజల్లో ఆందోళననెలకొందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి సూచనలు తీసుకొని కొన్ని సవరణలు చేయడానికి అవకాశం ఉందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయంతో సంబంధం లేకుండా ఆంటోనీ కమిటీ ఏం చేస్తుందనే వాదనలు తలెత్తుతున్నాయని, అయితే కమిటీ తాము సేకరించిన అంశాలను సీడబ్ల్యూసీకి అందజేస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీల సస్పెన్షన్‌పై స్పందిస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో నెలకొన్న ఆందోళన, పరిస్థితులను సభ్యులు పార్లమెంటులో వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వారిని సస్పెండ్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అయితే ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్న నేపథ్యంలో వారిని సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో మీరు పదవికి రాజీనామా చేస్తారా? అని పల్లంరాజును విలేకరులు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.