MM Pallam Raju
-
కడగండ్ల ఉప్పెనలో ‘కడలి’ బిడ్డలు..
సాక్షి, పిఠాపురం: ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని ఊయలలుగా, అగాధ జలధిని గంగమ్మ ఒడిగా భావించే ధీరులు వారు. కడలి కడుపులోని మత్స్యసంపదను వేటాడడమే వారి బతుకు బాట. సముద్రంపై సునాయాసంగా వేట సాగించే వారికి.. అలా వేటాడి తెచ్చిన చేపలను ఒడ్డుకు చేర్చడం తుపానులో నావను నడపడమంత కష్టతరమవుతోంది. వారి కష్టాలను గట్టెక్కించే మినీ హార్బర్ నిర్మాణం పాలకుల కపటపు హామీలకే పరిమితమవుతోంది. ‘గెలిపిస్తే మీ సమస్యలను చిటికెలో తీరుస్తాం. మినీ హార్బర్ నిర్మిస్తాం’ అని నమ్మించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్వర్మ ఎన్నో వాగ్దానాల్లాగే దాన్నీ విస్మరించారు. దాంతో గంగపుత్రులైన మత్స్యకారులు.. వలలో చిక్కిన చేపల్లా వెతల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యకారుల కష్టాలను గట్టెక్కిస్తామన్న సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ‘ఒడ్డు ఎక్కాక నావ తగలేసిన’ చందంగా ద్రోహం చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు. వందల బోట్లు, వేలమంది మత్స్యకారులు ఉన్న జిల్లాలో మూడు మండలాలకు చెందిన మత్స్యకారులకు మినీ హార్బర్ నిర్మాణం జరగకపోవడం పెనుసమస్యగా మారింది. చేపలవేటే ఆధారంగా సుమారు 20 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తుండగా అతి ముఖ్యమైన జెట్టీలు లేక వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రాణాలకు తెగించిన సముద్రంపై చేపల వేట సాగించే వారిని జెట్టీ సమస్య పీడిస్తోంది. కాకినాడ నుంచి విశాఖ వకూ ఉన్న తీర ప్రాంతంలో కాకినాడలో తప్ప ఎక్కడా జెట్టీలు కాని, హార్బర్లు కాని లేవు. దీంతో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లకు లంగరు వేసేందుకు మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ సమీపంలోని హార్బర్లో మాత్రమే ఈ మండలాలకు చెందిన మత్స్యకారుల బోట్లు నిలిపి చేపల క్రయ విక్రయాలు జరిపే అవకాశం ఉంది తప్ప మరే ఇతర సౌకర్యాలు లేవు. ప్రణాళికలకే పరిమితం మత్స్యకారులు తమ అగచాట్లను గతంలో కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన మినీ హార్బర్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అనంతరం కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు పెట్రోలు బంకు వద్ద సముద్రం పక్కనే ఉన్న సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని మినీ హార్బర్ నిర్మాణానికి అనువని అధికారులు గుర్తించారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మాణానికి ప్రణాళికలు సైతం సిద్ధమయ్యాయి. అయితే ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతూ రూ.300 కోట్లకు చేరింది. గతంలో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాల్లోని మత్స్యకారుల బోట్లను కాకినాడ హార్బర్లోకి అనుమతించక పోవడంతో కొన్ని ఏళ్లుగా వారు ఉప్పాడ సమీపంలో ఉన్న ఉప్పుటేరుని జెట్టీగా ఉపయోగించుకుంటున్నారు. ఏ మాత్రం అనువుగా లేకపోయినా గత్యంతరం లేని స్థితిలో బోట్లను ఉప్పుటేరులోనే లంగరు వేసి, వేటాడిన చేపలు ఒడ్డుకు మోసుకొచ్చి నడి రోడ్డుపైనే విక్రయించుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. తొండంగి, తుని మండలాల మత్స్యకారులకు ఉప్పుటేర్లు లేకపోవడంతో బోట్లను సముద్రంలోనే లంగరు వేయాల్సి వస్తోంది. తుపాన్లు సంభవించినప్పుడు కెరటాల ఉధృతితో సముద్రంలోని బోట్లను ఒడ్డుకు తెచ్చే అవకాశం ఉండదు. జెట్టీ లేక సముద్రంలోనే లంగరు వేస్తే బోట్లు మునిగి తీవ్ర నష్టం చవిచూస్తున్నామని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. మామూలు సమయాల్లో బోట్లపై వేటకు వెళ్లి తిరిగి వచ్చి సముద్రంలోనే లంగరు వేయాల్సి వస్తోంది. విలువైన బోట్లకు రక్షణ కరువు జెట్టీలు లేక వేటాడి తెచ్చిన చేపలను దింపేందుకు బోటును ఒడ్డు వరకూ తీసుకు రావాల్సి వస్తోంది. దాంతో పాటు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో బోట్లు, వలల వంటి విలువైన సామగ్రిని అతి కష్టం మీద తీవ్ర వ్యయప్రయాసలకోర్చి గ్రామాలకు దూరంగా ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఎలాంటి రక్షణా లేకుండా ఒడ్డుకు చేర్చుకోవల్సి వస్తోంది. దీంతో విలువైన బోట్లకు రక్షణ లేకుండా పోతుంది. అత్యవసర పరిస్థితుల్లో బోట్లను ఒడ్డుకు చేర్చుకొనే ప్రయత్నంలో ఉన్న మత్స్యకారులకు హార్బరే సురక్షిత ప్రాంతం అవుతుంది. కానీ ఈ ప్రాంతంలో హార్బర్ లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బోట్లను తీవ్ర వ్యయప్రయాసలకోర్చి ఒడ్డుకు చేర్చుకోవాల్సి వస్తోంది. హార్బరు, జెట్టీలు లేక డీజిల్, ఐస్, వంట సామగ్రిలను కెరటాల అవతల లంగరు వేసిన బోట్ల వద్దకు పట్టుకువెళ్లి నింపుకోవాల్సిన అగత్యం తప్పడం లేదు. కెరటాల అవతల లంగరు వేసిన బోట్లలో డీజీల్, ఐస్, వంట సామగ్రి చోరీ అవుతున్నాయని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. కష్టంతో పాటు నష్టాలే ఎక్కువ.. వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చుకొని అమ్ముకోవడానికి హార్బర్లో అయితే అన్ని సౌకర్యాలూ ఉండడం వల్ల చేపలు పాడవకుండా వెంటనే అమ్మకాలు జరిగి మత్స్యకారులు నష్టపోరు. అయితే పై మూడు మండలాల్లోని మత్స్యకారులకు హార్బర్ లేక చేపల అమ్మకాల్లో తీవ్ర జాప్యం ఏర్పడి నష్టాలు తప్పడం లేదు. వ్యాపారులు కాకినాడ హార్బర్‌కే పరిమితమౌతుండడంతో ఇక్కడ వేటాడిన చేపలను వేరే వాహనాలపై కాకినాడ హర్బర్‌కు తరలించి అమ్ముకోవాల్సి వస్తోందని మత్య్సకారులు వాపోతున్నారు. -
'పవన్ కల్యాణ్ అవగాహన చేసుకుని మాట్లాడాలి'
-
'పవన్ కల్యాణ్ అవగాహన చేసుకుని మాట్లాడాలి'
కాకినాడ : ఓటుకు కోట్లు కేసులో విచారణ చేసి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పల్లంరాజు గురువారం కాకినాడలో డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. అందుకే హైదరాబాద్ వెళ్లడానికి భయపడుతున్నారని ఆయన టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ ఎటువంటి కృషి చేస్తుందో అవగాహన చేసుకుని మాట్లాడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు పల్లంరాజు సూచించారు. తన తండ్రి, కేంద్ర మాజీమంత్రి ఎం.రామ సంజీవరావు జ్ఞాపకార్థం కాకినాడలోని జేఎన్టీయూలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి ప్రవళికకు శుక్రవారం గోల్డ్‌మెడల్ ప్రదానం చేయనున్నట్లు పల్లంరాజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా హైకమిషనర్ హరిందర్ కౌర్ హాజరవుతారని తెలిపారు. -
దీక్షపై హేళనగా మాట్లాడతారా?
ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్షపైన, కాపుల రిజర్వేషన్ల అంశంపైన ఏపీ రాష్ట్ర మంత్రులు హేళనగా మాట్లాడటం సరికాదని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు అన్నారు. ముద్రగడ కుటుంబంపై జరిగిన దాడిని యావత్ జాతిపై జరిగిన దాడిగా చూడాలని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రం కాపు ప్రముఖుల సమావేశం ఉన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ దీక్ష పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము అడుగుతున్నామని, తమ డిమాండులో న్యాయం ఉందని అయన తెలిపారు. -
అరెరె.. రాజుగారి కోటు మాయం!
రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల రజతోత్సవాల్లో రష్యన్ యువతులు కనికట్టు చేశారు. మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు కోటునే మాయం చేసేశారు. వేదికపై మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కూడా ఆశీనులయ్యారు. కోటు ధరించి ఉన్న పళ్లంరాజును ఓ బోను లాంటి తెరలో మూసి, క్షణాల్లో ఆ కోటును మాయం చేశారు. ఆయనతో పాటు కిరణ్‌కుమార్ రెడ్డి, హర్షకుమార్ తదితరులు ఈ మాయాజాలానికి మంత్రుముగ్ధులయ్యారు. - గరగ ప్రసాద్, సాక్షి, రాజమండ్రి -
'పట్టిసీమ ఆపండి.. పోలవరం కట్టండి'
కాకినాడ: ఓటుకు కోట్లు కేసులో కీలక నిందితులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు డిమాండ్ చేశారు. ఈ కేసులో దోషులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పోతుందని అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ నిర్మాణాన్ని నిలిపివేసి ముందుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు ప్రారంభించారని గుర్తు చేశారు. -
రక్షమాం.. పాహిమాం
ఏలూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు పూనుకుని కష్టాల్లో మునిగిపోరుున కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే ఆదుకోవాలని కేంద్ర మంత్రి, పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు కొణిదల చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునే చర్యల్లో భాగంగా బస్సుయూత్ర చేపట్టిన సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రులు జేడీ శీలం, ఎంఎం పళ్లంరాజు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి ఆదివారం ఉదయం ఏలూరు చేరుకున్నారు. స్థానిక మర్చంట్ చాంబర్ కల్యాణ మండపం వద్ద చిరంజీవికి, కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రఘువీరారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో సభ వెలవెలబోరుుంది. అతికొద్ది మంది కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు హాజరుకాగా, వారితోనే సభ నడిపించారు. చిరంజీవి అభిమానులు ‘సీఎం చిరంజీవి, జై చిరంజీవా’ అంటూ నినాదాలు చేయడంతో అలా అనొద్దని చిరంజీవి సైగలతో వారిని వారించారు. ఈ నినాదాల మధ్య సభను నడ పలేక మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఒకానొక దశలో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా మీకిది మర్యాద కాదంటూ చిరంజీవి అభిమానులను హెచ్చరించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతుండగా, ఉంగుటూరు నుంచి వసంత్‌కుమార్ పోటీ చేయాలని పలువురు కేకలు వేశారు. కాంగ్రెస్‌కు శీల పరీక్ష కేంద్ర మంత్రులు చిరంజీవి, రఘువీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ విభజన పాపం కాంగ్రెస్‌ది కాదని చెప్పుకొచ్చారు. దీనికి టీడీపీ సహా పలు పార్టీలు మద్దతు పలకడం వల్లే సీడబ్ల్యుసీ తీర్మానం చేసిందన్నారు. విభజన భాధాకరమని.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శీఘ్రంగా కోలుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మబలికారు. పాతనీరు పోతే పోయిందని.. కొత్త వారికి అవకాశాలు వస్తాయన్నారు. చంద్రబాబు వలసలను ప్రోత్సహించడం.. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా అందులో చేరిపోవడం వారి అనైతికతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సమైక్య చాంపియన్ అయిపోదామనుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం విడిపోయూక కొత్తపార్టీ పెట్టి నవ్వుల పాలయ్యూరని రఘువీరా నిప్పులు చెరిగారు. బస్సు యాత్ర ద్వారా పార్టీల కుతంత్రాలను ప్రజలకు వివరిస్తున్నామని, రథయూత్ర తరహాలో సాగుతున్న దీని చక్రాల కింద ఇతర పార్టీలు నలిగిపోరుు నాశనం అవుతాయని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ శీల పరీక్ష ఎదుర్కొంటోందని, ఈ గండం నుంచి పార్టీని గట్టెక్కించి నవ్యాంధ్రప్రదేశ్ కోసం అందరూ పనిచేయాలని కోరారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర రంగాల్లో సీమాంధ్రను దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని వివరించారు. కేంద్ర మంత్రులు ఎంఎం పళ్లంరాజు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, రాష్ట్ర తాజా మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్, కొండ్రు మురళి, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయూలని కోరారు. ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మల్లిపూడి కనకదుర్గ, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గద్దె వెంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఆర్‌కే చౌదరి, పీసీీసీ ప్రధాన కార్యదర్శి రాజనాల రామ్మోహన్రావు, అలగా రవికుమార్, బీవీ రాఘవయ్య చౌదరి, బద్దా ఆనంద్‌కుమార్, కమ్ముల కృష్ణ, చిట్టిబొమ్మ వెంకటస్వామి పాల్గొన్నారు. సభ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ శ్రేణులకు వీడ్కోలు పలికిన చిరంజీవి బస్సుయాత్ర విజయవాడకు బయల్దేరింది. -
అన్ని వర్గాల వారితో అంటోనీ కమిటీ భేటీ: పల్లంరాజు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల వారితోనే కాకుండా అన్ని వర్గాల ప్రజలతో అంటోనీ కమిటీ భేటీ అవుతుందని కేంద్ర మంత్రి ఎం.ఎం. పల్లంరాజు తెలిపారు. త్వరలో హైదరాబాద్‌కు వచ్చే ఈ కమిటీ హైదరాబాద్‌లోని విద్యార్థులు, ఉద్యోగులు వివిధ వర్గాల వర్గాల వారితో సమావేశమై వారికున్న భయాందోళనలపై వివరాలు తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రాయలసీమకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుందని, నీటి పంపకాలపై సమాచారం సేకరిస్తుందని వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పల్లంరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రా, రాయలసీమ ప్రజల్లో ఆందోళననెలకొందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి సూచనలు తీసుకొని కొన్ని సవరణలు చేయడానికి అవకాశం ఉందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయంతో సంబంధం లేకుండా ఆంటోనీ కమిటీ ఏం చేస్తుందనే వాదనలు తలెత్తుతున్నాయని, అయితే కమిటీ తాము సేకరించిన అంశాలను సీడబ్ల్యూసీకి అందజేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీల సస్పెన్షన్‌పై స్పందిస్తూ సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో నెలకొన్న ఆందోళన, పరిస్థితులను సభ్యులు పార్లమెంటులో వ్యక్తం చేశారని పేర్కొన్నారు. వారిని సస్పెండ్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అయితే ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్న నేపథ్యంలో వారిని సస్పెండ్ చేశారని, సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో మీరు పదవికి రాజీనామా చేస్తారా? అని పల్లంరాజును విలేకరులు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.