జై తెలంగాణ అంటూ ఆ ప్రాంత సభ్యుల నినాదాల మధ్య హడావుడిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పాటు భూసేకరణ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ.. నిరవధికంగా వాయిదా పడింది.
జై తెలంగాణ అంటూ ఆ ప్రాంత సభ్యుల నినాదాల మధ్య హడావుడిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పాటు భూసేకరణ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ.. నిరవధికంగా వాయిదా పడింది. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ సభ్యులు లేచి, వెల్లోకి దూసుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాలంటూ నినాదాలు చేశారు. వాళ్లను తమతమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ మనోహర్ ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోకపోవడంతో ఆయన సభను గంటసేపు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఈ గందరగోళం మధ్యనే ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బిల్లును, భూసేకరణ బిల్లును ప్రతిపాదించగా వాటిని మూజువాణీ ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఓటాన్ అకౌంట్ను ఆమోదించేందుకు గత సోమవారం నుంచి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు ఈరోజే ఆఖరి రోజు. రాష్ట్ర విభజన అంశం కారణంగా సభ ప్రతిరోజూ గందరగోళంగానే నడిచింది.