కడప రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులను బీసీ జాబితాలో చేర్చే ప్రతిపాదన విరమించుకోకపోతే బీసీ వర్గాలు తిరుగుబాటు ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరం ఎన్జీఓ కాలనీలోని సాయి ఫంక్షన్ హాలులో ఏపీ బీసీ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ఎస్.యానాదయ్య అధ్యక్షతన బీసీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అన్నా రామచంద్రయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం కాపులను బీసీ జాబితాలో చేర్చాలనుకోవడం తగదన్నారు. కాపులు ఎలాంటి వివక్షకు గురికాకుండా అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధించారని తెలిపారు.
బీసీ వర్గాలు ఇప్పటికీ వివక్షకు గురికావడంతోపాటు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు బీసీలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ఇలాంటి తరుణంలో కాపులను బీసీ జాబితాలో చేర్చడం ఏమిటని ప్రశ్నించారు. జనాభాలో 50 శాతానికి పైగా బీసీ వర్గాలు ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధిక శాతం మంది కాపు వర్గానికి చెందినవారే మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే మంజునాథ కమిషన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఊసా సాంబశివరావు, గూడూరు వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ మూర్తి, రాజగోపాల్, బొర్రా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదన విరమించుకోవాలి
Published Sun, Jul 3 2016 8:10 PM | Last Updated on Sat, Aug 18 2018 6:00 PM
Advertisement
Advertisement