
సాగునీటి రంగానికి వైఎస్ జగన్ సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపులో వెనుకాడ లేదు. గత ప్రభుత్వం కన్నా జల
వనరుల ప్రాజెక్టులకు నిధులు అధికంగానే కేటాయించారు. కరువుతో అల్లాడుతున్న జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల కింద గ్యాప్ ఆయకట్టు నానాటికి పెరుగుతోంది. రిజిస్టర్ అయిన ఆయకట్టు నానాటికి దిగజారి పోతుంది. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జిల్లాలోని రైతుల ఆంక్షలు, ఆశలకు సమకాలికంగా కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు.
సాక్షి, ఒంగోలు : జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. దసరా, సంక్రాంతి పండుగల నాటికి మొదటి సొరంగం పనిని పూర్తి చేసి నీళ్లిస్తామంటూ ఐదేళ్లు కాలం గడిపేశారు. తీరా ఎన్నికలు వచ్చినా వెలుగొండ నుంచి నీళ్లు రాలేదు. వెలుగొండ కింద సాగు నీటి కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వెలిగొండను ప్రతిష్టాత్మకంగా స్వీకరించింది. ఈ బడ్జెట్‌లో నిధులను గత ప్రభుత్వం కన్నా అధికంగానే కేటాయించింది. ఏడాదిలోగా పనులను పూర్తి చేసి 1.1 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోనున్నారు.
రూ.485.10 కోట్లు
వెలిగొండ మొదటి టన్నెల్ పనిని పూర్తి చేసేందుకు కేటాయింపులు రూ.28 కోట్లు గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్ పనులు,ఇతర పనులకు కేటాయింపు
1.10 లక్షల ఎకరాలు
వెలిగొండ పరిధిలో ఏడాదిలోగా పంటలకు నీళ్లివ్వాలన్న లక్ష్యం
రూ.544.52 కోట్లు
2018–19కు గత ప్రభుత్వం నీటి పారుదల రంగానికి కేటాయించిన నిధులు
రూ.670.65 కోట్లు
2019–20కు నీటిపారుదల రంగానికి వైఎస్ జగన్ సర్కార్ కేటాయించిన నిధులు
ఎర్రం చిన్నపోలిరెడ్డి ప్రాజెక్ట్‌కు ..
ఎర్రం చిన్న పోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి రూ.10 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కింద రూ.111.05 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పరిధిలో పైప్‌లైను పనులు జరుగుతున్నాయి. గుండ్లకమ్మ రిజర్వాయను నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టు కింద 20 వేల ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంగా ప్రతిపాదించారు. 1.33 టీఎంసీల నీటిని తీసుకొనే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. భూసేకరణ, పైపులైన్ల పనులకు ఈ నిధులను కేటాయించారు.
పాలేరు రిజర్వాయర్‌కు రూ.5 కోట్లు..
పాలేరు–బిట్రగుంట ప్రాజెక్టు పనులకు రూ.5 కోట్ల కేటాయింపు జరిగింది. పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ పనులకు రూ.5 కోట్లు నిధులను కేటాయించారు. రిజర్వాయర్ పనులకు రూ.4.9 కోట్లు, రూ.10 లక్షలు భూసేకరణకు నిధులను కేటాయించారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.50.50 కోట్లు కాగా ఇప్పటికి రూ.15.07 కోట్లు పని జరిగింది.
జిల్లాలోని ఇతర మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పించారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.1.01 కోట్లు, మోపాడుకు రూ.5 లక్షలు, పోతురాజుకాలువ ఆధునీకీకరణ పనులకు రూ.50 వేలు నిధుల కేటాయింపు జరిగింది.
నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం
సాగునీటి ప్రాజెక్టులకు అన్ని విధాలుగా చేయూత ఇస్తానన్న జగన్ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లాలో లక్షన్నర ఎకరాలకు పైగా గ్యాప్ ఆయకట్టు పెరిగింది. ఐదేళ్ల నుంచి నీటి పారుదల రంగానికి చుక్క నీరు రావడం లేదు. మధ్య తరహా ప్రాజెక్టుల విషయంలోనూ అస్సలు ఆయకట్టుకే నీరు లేకుండా పోయింది. నాగార్జునసాగర్ కాలువల పరిధిలో లక్షన్నర ఎకరాలకుపైగా గ్యాప్ ఆయకట్టుకు నీరు రాలేదు. ఈ నేపథ్యంలోనే వెలుగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చి ఈ ప్రాజెక్టు ఏడాదిలోగా మొదటి టన్నెల్ పనిని పూర్తి చేసి నీరివ్వడానికి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వెలుగొండ ద్వారానే కరువు జిల్లా అభివృద్ధికి నోచుకుంటుంది. నీటి పారుదల ప్రాజెక్టులకు కావల్సినంత నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఇవ్వడం గమనార్హం.
గుండ్లకమ్మకు రూ.28 కోట్లు కేటాయింపు
గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులకు, కాలువల పనులకు, పునరావాసకాలనీలలోని పనులకు, పునరావాస చెల్లింపులు, ఇతర పనులకు కలిపి నిధులు కేటాయించారు. కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశయం పనులకు బడ్జెట్‌లో రూ.28 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 12.845 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకునే సామర్ధ్యంతో అప్పటి సీఎం డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా గుర్తింపు ఉంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.753.83 కోట్లు కాగా ఇప్పటికి రూ.621.98 కోట్లు వెచ్చించారు. ఖరీఫ్‌కు 62,368 ఎకరాలు, రబీకి 80,060 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. అయితే ఇంకా గుండ్ల కమ్మ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ పూర్తి కాలేదు. జాతికి అంకితం చేయలేదు. గుండ్లకమ్మ దాదాపు పనులన్నీ పూర్తయినా సాగుకు నీరు అధికారికంగా ఇవ్వడం లేదు. గుండ్లకమ్మ పరిధిలో 37.72 ఎకరాల వరకు ఇంకా భూసేకరణ పెండింగ్‌లో ఉంది. రైతులు కోర్టుకు వెళ్లడంతో భూసేకరణ నిలిచిపోయింది.
ఏడాదిలోగా వెలిగొండ నీళ్లివ్వడమే లక్ష్యం
జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుకు 2019–20 బడ్జెట్‌లో రూ.485.10 కోట్ల వరకు కేటాయించారు. మొత్తం 43.58 టీఎంసీల నీటిని తీసుకుని 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. 15.25 లక్షల మంది జనాభాకు ఈ ప్రాజెక్టు ద్వారానే తాగునీరు అందించేందుకు డిజైన్ చేశారు. వెలిగొండ మొత్తం రూ.5150 కోట్లు అంచనా వ్యయం కాగా రూ.4844.46 కోట్ల పనులు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.485 కోట్లు కేటాయింపు జరిగింది. మొదటి టన్నెల్ పనిని పూర్తి చేసి ఏడాదిలోగా నీళ్లివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment