చంద్రబాబు వద్దకు ఆశావహులు క్యూ..
అమరావతి: ఎల్లుండి మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు ఆశావహులు క్యూ కట్టారు. అయితే అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, పదవులు రానివారు పని చేయడం లేదన్న భావనలోకి వెళ్లవద్దని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. అన్ని సమీకరణలు చూసుకుని మంత్రవర్గ విస్తరణ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
కేబినెట్ విస్తరణలో అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కో జిల్లాకు ఏడెనిమిది మంది వరకూ ఆశతో ఉన్నారు. ఎవరిని తప్పిస్తారు...ఎవరితో ఆ బెర్త్ భర్తీ చేస్తారనే దానిపిఐ చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో ఆశావహుల జాబితా అత్యధికంగా ఉండడం, ఏడెనిమిది మందికి మించి అవకాశం లేకపోవడంతో అసంతృప్తులు వెల్లువెత్తుతాయన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి తన వద్దకు వచ్చిన వారిని బుజ్జగిస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన ప్రాంతంలోనే కొత్తగా మంత్రివర్గంలోకి చేరబోయే లోకేశ్, తదితరుల ప్రమాణస్వీకారం జరిపించాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రమాణ స్వీకారానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖను ప్రభుత్వం ఆదేశించింది.