గ్రామకంఠాలపైనా ‘రియల్’ ప్లానేనా
Published Mon, Dec 28 2015 9:37 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
హైదరాబాద్/విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత గ్రామాల్లో గ్రామకంఠాలపై ఇంకా దోబూచులాట కొనసాగుతోంది. గ్రామకంఠాలను నోటిఫై చేయాల్సిన ప్రభుత్వం గత ఆరు నెలలుగా నాన్చివేత ధోరణి అవలంబిస్తోంది. నోటిఫై చేసి రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లో గ్రామకంఠాల వివరాలను వెల్లడిస్తే తన రియల్ వ్యాపారానికి అడ్డంకిగా మారుతుందనే కారణంతో సర్కారు బహిర్గతం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామకంఠాలను ప్రకటించకుండా రాజధాని మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామకంఠం పరిధిలో ప్రభుత్వ కట్టడం వస్తుందా? లేక నివాస స్థలాల నడుమ ప్రదేశాలను గ్రామకంఠాల నుంచి తప్పించి ఏ కట్టడాన్నైనా నిర్మిస్తున్నారా? అనే అనుమానాలు గ్రామాల్లో తలెత్తుతున్నాయి. ఇళ్ల మధ్య ఖాళీ స్థలముంటే దాన్ని గ్రామకంఠంగా గుర్తించకుండా ఆ స్థలాన్ని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటే విస్తీర్ణం పెరుగుతుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే గ్రామకంఠం వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
2,639.78 ఎకరాలను గుర్తించినట్లు ప్రకటన
రాజధాని ప్రాంతంలో గ్రామ ఉమ్మడి భూముల(గ్రామకంఠం) సంఖ్య, వాటి వివరాలను తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని ప్రాంతంలో గ్రామకంఠాలు 2,639.78 ఎకరాలు గుర్తించినట్లు ప్రభుత్వం లిఖిత పూర్వకంగా తెలియజేసింది. వాటి వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.
ఆది నుంచీ రగడే
గ్రామకంఠాల అంశంలో తొలి నుంచీ సర్కారుకు, స్థానికులకు మధ్య రగడ జరుగుతూనే ఉంది. 2014 డిసెంబర్ 8న శాటిలైట్ సర్వే జరిగింది. ఆ రోజు నాటికి నిర్మాణాలు జరిగిన ప్రాంతాలనే గ్రామకంఠాలుగా గుర్తించారు. వీటిలో ఇళ్ల నడుమ ఖాళీ స్థలాలు, పశువుల కొట్టాలు, పొగాకు బ్యారన్లను గ్రామకంఠాల్లో చేర్చలేదు. దీంతో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇళ్ల మధ్య ఖాళీ స్థలం ఉంటే అందులో 500 గజాల వరకు గ్రామకంఠంలో చేర్చేందుకు, పొగాకు బ్యారన్లు, పశువుల కొట్టాలను కూడా ఇందులో చేర్చేందుకు అధికారులు మౌఖిక హామీనిచ్చారు.
సమస్యకు పరిష్కారం చూపండి
గ్రామ కంఠాలపై ఆగస్టు 20న ప్రభుత్వం గ్రామాల వారీగా నోటిఫికేషన్ ప్రకటించడంతో రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ సమస్యను పరిష్కరించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌కు బాధ్యతను అప్పగించారు. రైతులను విచారించి 2014 డిసెంబర్ 8 నాటికి ఉన్న భూముల వివరాల తాలూకు ఛాయాచిత్రాల ఆధారంగా గ్రామ కంఠాలను నిర్ణయించాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. దీనిపై వ్యతిరేకత వ్యక్తమైంది. గ్రామ కంఠాల సమస్యకు పరిష్కారం చూపకుండా మాస్టర్‌ప్లాన్ ముసాయిదా ప్రకటించడం సరికాదని రైతులు వాపోతున్నారు.
Advertisement
Advertisement