![AP Chief Whip Requested To Not Believe Any Mediators For Govt Jobs - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/20/gattu.jpg.webp?itok=ua6zTQbU)
సాక్షి, వైయస్సార్: రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అతి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, అయితే దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు. అంతేకాక రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇందుకుగాను అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
డీఎస్సీ రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాల పేరిట దళారులు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తనకు లేదా జిల్లా ఎస్పీకి లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లో గానీ ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగాల ఎంపికలో దళారులను నమ్మి మోసపోవద్దని నిరుద్యోగ యువతకు ప్రభుత్వ చీఫ్ విప్ సలహా ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి నిర్ములనకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆదేశించారు. లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాక పట్టాదారు పాస్ బుక్, రేషన్, పెన్షన్, భవనాల అప్రూవల్స్ తదితర విషయాల్లో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచాలకు పాల్పడినట్లు తెలిస్తే సహించేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment