వైఎస్‌ జగన్‌: అక్క చెల్లెమ్మలకు ఆస్తి రూ. 20000 కోట్లు | YS Jagan Comments On Housing Scheme Today Spandana Review Meeting - Sakshi
Sakshi News home page

30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆస్తి రూ. 20000 కోట్లు

Published Wed, Jul 8 2020 3:42 AM | Last Updated on Wed, Jul 8 2020 5:16 PM

AP CM YS Jagan Comments On Housing Scheme Today Spandana Review Meeting - Sakshi

ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి

‘ఆగస్టు 15న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. అప్పటికి కోర్టు కేసులు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో ఉన్నాం. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం   వచ్చినట్లుగానే అదే రోజు పేదలకు కూడా స్వాతంత్య్రం వస్తుందని భావిస్తున్నాం’

పేదలకు ఇళ్ల స్థలాలను డి–పట్టాల కింద, అసైన్డ్‌ కింద ఈ రోజైనా ఇవ్వొచ్చు. కానీ డి–పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్లు అవుతుంది. అనుకోకుండా కోర్టు కేసుల కారణంగా ఆలస్యం అయింది ‘రాష్ట్రంలో దాదాపు 1.5 కోట్ల ఇళ్లుంటే.. 20 శాతం అంటే దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం’   

జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చేద్దామనుకున్నాం. దీనిద్వారా ఎంతో మంది పేదల జీవితాలకు పెద్ద ఆధారం దొరుకుతుందని చాలా ఆశపడ్డాం. దురదృష్టవశాత్తూ కొంతమంది తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లారు. దీనివల్ల ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చింది. కోవిడ్‌ వల్ల కేసులు డిస్పోజ్‌ కాలేదు.మంచి కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాస్త ఆలస్యమైనా ధర్మం గెలుస్తుంది. మనం మంచి ఆలోచనతో చేస్తున్నాం. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాం
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.20 వేల కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల స్థలాల పట్టాల రూపంలో జూలై 8న ఇవ్వడం ద్వారా ఎంతో మంది పేదల జీవితాలకు పెద్ద ఆధారం లభిస్తుందని చాలా ఆశ పడ్డామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తూ కొంతమంది తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లారని, దీనివల్ల ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చిందని కానీ కోవిడ్‌ వల్ల కేసులు డిస్పోజ్‌ కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పేదలందరికీ ఆగస్టు 15వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.

అప్పటికి కోర్టు కేసులు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు. దాదాపు 40 రోజుల సమయం లభించినందున దీన్ని సద్వినియోగం చేసుకుని లేఅవుట్లలో మొక్కలు నాటడం, ఇళ్ల స్థలాల పట్టాల డాక్యుమెంట్లలో ఫొటోలు, ప్లాట్ల నెంబర్ల నమోదుతో పాటు సరిహద్దులు స్పష్టంగా పొందుపరచడం లాంటి కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలని కలెక్టర్లను సీఎం కోరారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పలు అంశాలపై జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 
స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

చరిత్రలో నిలిచేలా చేయాలి.. 
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా నేపథ్యంలో మరింత మెరుగ్గా ఈ కార్యక్రమాన్ని  చేయాలి. ఇది చరిత్రలో నిలిచిపోయే పని. ఫలానా ప్రభుత్వంలో, ఫలానా కలెక్టర్‌ ఉన్నప్పుడు మాకు మేలు జరిగిందని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారు. దీన్ని ఇంకా ఎలా బాగా చేయాలన్నది ఆలోచించాలి. 

62 వేల ఎకరాలు.. 20 వేల కోట్లు 
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 62 వేల ఎకరాలను సేకరించాం. ప్రైవేటు ల్యాండ్‌కు రూ.7,500 కోట్లు కాగా ప్రభుత్వం భూమి విలువ మరో రూ.7500 కోట్లు ఉంది. ఎన్‌ఆర్‌ఈజీఏ పనుల ద్వారా రూ.2 వేల కోట్లు, విశాఖపట్నం, సీఆర్‌డీఏ, టిడ్కో స్థలాల విలువ మరో రూ.2 వేల కోట్లు.. అలా దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన ఆస్తులను 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతికి ఇస్తున్నాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు సగం ఇళ్ల నిర్మాణాన్ని తరువాత నెలలోనే మొదలు పెట్టాలని లక్ష్యంగా పని చేస్తున్నాం. అందుకు అనుమతులు కూడా తీసుకున్నాం. ఇంకా ఎవరికైనా అర్హత ఉండి కూడా ఇంటి స్థలం రాకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే రేషన్‌ కార్డు, పెన్షన్‌ కార్డు, 90 రోజుల్లోగా ఇంటి స్థలం ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మరోసారి గుర్తు చేస్తున్నా. నాకు ఓటు వేయకపోయినా సరే అర్హత ఉంటే వారికి ఇంటి స్థలం ఇవ్వాలి.    

ఒక్క బిల్లూ పెండింగ్‌లో ఉండకూడదు 
ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.5,500 కోట్లు ఇవ్వగా రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే అన్ని బిల్లులను అప్‌లోడ్‌ చేస్తే ఈ నెలలోనే పూర్తిగా చెల్లిస్తాం. ఇళ్ల స్థలాల పట్టాలిచ్చే నాటికి ఒక్క బిల్లు కూడా పెండింగ్‌లో లేకుండా ఉండాలి. భూసేకరణతో సహా ఏ పనికి సంబంధించిన బిల్లు కూడా పెండింగ్‌లో ఉండకూడదు.  

గత సర్కారు తీరు దారుణం 
టీడీపీ సర్కారు నిరుపేదలకు 6.2 లక్షల ఇళ్లు కడతామని చెప్పి కేవలం 3.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టింది. వాటికీ రూ.1,300 కోట్లు బకాయి పెట్టారు. ఇక పట్టణ గృహ నిర్మాణంలో మరీ దారుణంగా వ్యవహరించారు. 7 లక్షల ఇళ్లు అని చెప్పి కేవలం 3 లక్షల ఇళ్లను మాత్రమే ప్రారంభించి సగంలో ఆపారు. ఆ పనులకు సంబంధించి మరో రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టారు. సీఎంగా ఉన్నవారికి పేదలకు ఇళ్లు కట్టాలన్న తపన, తాపత్రయం ఉంటే ఇంత దారుణ పరిస్థితి ఉండేది కాదు. 

ఉపాధిలో 8 కోట్ల పనిదినాలు అభినందనీయం.. 
కరోనా సమయంలోనూ మే నెలలో దాదాపు 8 కోట్ల పనిదినాలు కల్పించిన కలెక్టర్లను ప్రశంసిస్తున్నా. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో 43 లక్షల కుటుంబాలకు రూ.4,117 కోట్లు ఉపాధి హామీ లేబర్‌ కాంపొనెంట్‌ కింద ఇవ్వగలిగాం. మెటీరియల్‌ కాంపొనెంట్‌ విషయంలో కలెక్టర్లు దృష్టి పెట్టాలి.  

స్థలాలు గుర్తించి వేగంగా పనులు.. 
గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించి వెంటనే అప్రూవల్స్‌ ఇవ్వాలి.  ఆగస్టు 31 నాటికి అన్ని గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలి. రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌ కోసం కూడా స్థలాల గుర్తింపు వేగంగా పూర్తి కావాలి.   

కరోనా పరీక్షల్లో రికార్డు 
కరోనా పరీక్షల్లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. 10 లక్షలకు పైగా కోవిడ్‌ టెస్టులు చేశాం. అందుకు అధికారులు, కలెక్టర్లకు అభినందనలు. 85 శాతం కేసులు ఇంట్లోనే నయం అవుతున్నాయి. హెల్త్‌ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వాకబు చేయాలి. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ నాణ్యమైన సేవలందించాలి. కోవిడ్‌తో కలిసి బతకాల్సిన సమయం ఇది. వ్యాక్సిన్‌ కనుగొనే వరకు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కోవిడ్‌ లక్షణాలుంటే ఏం చేయాలి? ఎవరికి ఫోన్‌ చేయాలి? ఎక్కడకు వెళ్లాలి? అనే అంశాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేయడం వల్ల ప్రజలు వైద్యం చేయించుకోవడం సులభం అవుతుంది. వైద్య సాయం అందించే కాల్‌ సెంటర్లు, టెలి మెడిసిన్‌ నంబర్లు పక్కాగా పనిచేయాలి. ఆ యంత్రాంగం సరిగ్గా ఉందా? లేదా? అనేది తనిఖీ చేసి నిర్ధారించుకోవాలి. 

ఇసుక కొరతనే మాటే వినిపించకూడదు
వర్షాలు బాగా కురుస్తున్నందున ఇసుక రీచ్‌ల్లోకి నీరు చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే వారం, పది రోజుల్లోగా స్టాక్‌ యార్డుల్లో పెద్ద ఎత్తున ఇసుకను నిల్వ చేయాలి. కలెక్టర్లు చర్యలు చేపట్టి బ్యాక్‌లాగ్‌ క్లియర్‌ చేయటంతోపాటు స్టాక్‌ యార్డుల్లో పూర్తిగా నిల్వ చేయాలి. ఇసుక కొరత ఉందనే మాట ఎక్కడా వినిపించకూడదు. కలెక్టర్లు, జేసీలు ఏం చేస్తారో, ఎలా చేస్తారో  నాకు తెలియదు. ఎక్కడా ఇసుక కొరత రాకూడదు. ముఖ్యంగా ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఇసుక బ్యాక్‌ లాగ్‌ను వెంటనే క్లియర్‌ చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement