
'నిందితులను కఠినంగా శిక్షిస్తాం'
విజయవాడ : వంగవీటి మోహనరంగా విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహం ధ్వంసానికి సంబంధించి సీసీ ఫుటేజి ఆధారంగా విచారణ జరుపుతున్నామని చెప్పారు.
సింగ్‌నగర్‌లో వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం, కైకలూరులో ఫ్లెక్సీల చించివేత కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అభిమానం వెర్రి తలలు వేయరాదని, గొడవలను ప్రొత్సహించే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ప్రతి విగ్రహానికీ, ఫ్లెక్సీకి భద్రత కల్పించలేమన్నారు. ఇకపై ఫ్లెక్సీలను కూడా రెగ్యులేట్ చేస్తామని డీజీపీ తెలిపారు.