
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని అన్ని తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఎనిమిది తరగతులను వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి, తొమ్మిదో తరగతికి 2021–22 నుంచి, పదో తరగతికి 2022–23 నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ మం గళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని స్కూ ళ్లలో ఇంగ్లిష్ మీడియంను అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌కు అప్పగించి అందుకు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు.
ఇంగ్లిష్ మీడియం అమలుకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తీసుకోవాల్సిన చర్యలు..
– టీచర్, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ప్రతి పాఠశాలలో అవసరమైన ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు నియమించేలా చర్యలు తీసుకోవాలి.
– ఇంగ్లిష్ మీడియంలో బోధించడానికి ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వడం, హ్యాండ్ బుక్స్ రూపకల్పన, వాటిని అభివృద్ధి చేయడం, తరగతి గదుల్లో ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, టీచర్లకు అవసరమైన బోధన మెటీరియల్‌ను రూపొందించే బాధ్యతను ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) నిర్వహిస్తుంది.
– ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉన్న ఇంగ్లిష్ నైపుణ్య స్థాయిని ఆన్‌లైన్‌లో అంచనా వేయడం, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం పెంచేందుకు టీచర్లకు ఇవ్వాల్సిన శిక్షణా తరగతుల రూపకల్పన గురించి ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్.. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌తో సమన్వయం చేసుకోవాలి.
– వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు (1 నుంచి 8 తరగతి వరకు) ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ, 2020 వేసవిలోనూ టీచర్లకు విస్తృతంగా శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించి.. వారి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి.
– టీచర్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన సామర్థ్యం మెరుగుపడే వరకు, వారు బోధన మెళకువలు నేర్చుకునే వరకు సంబంధిత సబ్జెక్టు, సాధారణ అంశాలపై వారికి ఎక్కువ శిక్షణ ఇవ్వాలి.
– ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ ఇంగ్లిష్ సెంటర్ల (డీఈసీలు)ను డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డీఐఈటీ)లుగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి.
– పాఠ్యపుస్తకాల ముద్రణ డైరెక్టర్ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు నమోదైన విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలను సరఫరా చేసేందుకు వీలుగా కచ్చితమైన ఇండెంట్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలి.
– వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో ఒకటి నుంచి ఎనిమిది తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తున్న దృష్ట్యా అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్య, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపాలి.
– ఇంగ్లిష్ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అర్హులైన అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే టీచర్ల నియామకాల్లో నియమించుకోవాలి.