
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అన్ని ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో తెలుగు/ఉర్దూ భాషలను తప్పనిసరిగా విద్యార్థులు అభ్యసించాలి. ఆంగ్ల మాధ్యమం అమలు, తెలుగు/ఉర్దూ భాషల బోధనను విజయవంతంగా అమలు చేయడంపై విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు బుధవారం జీఓ 85ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం...
- ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థి, టీచర్ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలి.
- బోధనా నైపుణ్యాల పెంపునకు అవసరమైన హ్యాండ్‌బుక్స్, ఇతర మెటీరియల్‌ను ఎస్సీఈఆర్టీ సిద్ధం చేయాలి.
- ఆంగ్ల మాధ్యమంలో బోధించేలా టీచర్లకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో, వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్లు, జిల్లా ఇంగ్లిష్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.
- విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల ముద్రణకు పాఠ్య పుస్తక విభా గం చర్యలు చేపట్టాలి.
- ఎంతమంది టీచర్లు అవసరమో ప్రభుత్వానికి నివేదించాలి. భవిష్యత్తులో ఆంగ్ల మాధ్యమ బోధనలో నైపుణ్యం ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయాలి.